బీజేపీతో పొత్తుకు కుమారస్వామి ఎవరు? పార్టీ అధ్యక్షుడ్ని నేనే!
బీజేపీతో పొత్తు విషయంపై కుమారస్వామి తీసుకున్న నిర్ణయాన్నిసీఎం ఇబ్రహీం తప్పు పట్టారు.
By: Tupaki Desk | 17 Oct 2023 4:39 AM GMTకర్ణాటక రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికే కాదు.. రాజకీయాల మీద మినిమం పరిచయం ఉన్న వారికి సైతం దేవగౌడ ఎవరో తెలిసిందే. ఆయన కుమారుడు కుమారస్వామిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశ ప్రధానిగా దేవగౌడ.. కర్ణాటకకు మాజీ ముఖ్యమంత్రిగా కుమారస్వామి సుపరిచితం.
అయితే.. పార్టీ సీనియర్ నేత సీఎం ఇబ్రహీం విషయానికి వస్తే.. ఆయన గురించి అవగాహన ఉండదు. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న కుమారస్వామి తీరును తప్పు పట్టటమే కాదు.. ఆయన నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పడుతూ ప్రశ్నించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.
బీజేపీతో పొత్తు విషయంపై కుమారస్వామి తీసుకున్న నిర్ణయాన్నిసీఎం ఇబ్రహీం తప్పు పట్టారు. అంతేకాడు.. జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి తానే అధ్యక్షుడినంటూ పేర్కొనటమే కాదు.. పార్టీ పగ్గాలు తన చేతిలో ఉన్నాయంటూ స్పష్టం చేశారు. బీజేపీతో పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లుగా కుమారస్వామి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎవరూ దించలేరన్న ఆయన.. పార్టీ సిద్ధాంతామైన లౌకికవాదానికి వ్యతిరేకంగా కుమారస్వామి వ్యవహరించినట్లుగా ఆయన పేర్కొంటున్నారు.
పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్న తనతో ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఎన్సీపీ నేత శరద్ పవార్.. పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడారని.. ఈ మీటింగ్ లోని చర్చించిన అంశాల్ని పార్టీ వ్యవస్థాపకుడు.. మాజీ ప్రధాని దేవగౌడ ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పార్టీ అభిప్రాయాన్ని తీసుకోకుండా కుమారస్వామి ఏకపక్షంగా ఢిల్లీకి వెళ్లి బీజేపీతో పొత్తు పెట్టుకోవటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
జనతాదళ్ కు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని.. లౌకిక వాదంతో విడదీయరాని బంధం ఉందన్న ఆయన.. ఎన్ ఆర్ సీ.. ముస్లిం పర్సనల్ లా అంశాల జోలికి పోనని బీజేపీ భరోసా ఇస్తుందా? అని ప్రశ్నించిన ఆయన.. బీజేపీతో పొత్తును అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
ఈ అంశంపై సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని దేవగౌడకు విన్నవించిన ఆయన.. దౌవగౌడను ప్రధానమంత్రిని చేసిందే లౌకిక శక్తులని.. ఆయన ఆ విషయాన్ని మర్చిపోరన్న ఇబ్రహీం మాటలపై జనతాదళ్ పెద్దాయన ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.