Begin typing your search above and press return to search.

గుడివాడ లో కుమారి ఆంటీ ఎన్నిక‌ల ప్రచారం.. ఏ పార్టీ త‌ర‌ఫునంటే..?

హైదరాబాద్ లో బండిపై భోజనాలు అమ్మే కుమారీ ఆంటీ ఇటీవల కాలంలో ఫుల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 May 2024 4:17 AM GMT
గుడివాడ లో కుమారి ఆంటీ ఎన్నిక‌ల  ప్రచారం.. ఏ పార్టీ త‌ర‌ఫునంటే..?
X

హైదరాబాద్ లో బండిపై భోజనాలు అమ్మే కుమారీ ఆంటీ ఇటీవల కాలంలో ఫుల్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. రోడ్డుపక్కనున్న ఆమె హోటల్ బండిని ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో ఆమె మరింత ఫేమస్ అయ్యారు! ఆమె వ్యవహారంలో సాక్ష్యాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె టీవీ షోలలో పాల్గొనడం కూడా చేశారు! అ సంగతి అలా ఉంటే... తాజాగా ఆమె ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు!

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందులో భాగంగా... ఆమె గుడివాడ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ఆమె గుడివాడలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా... ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే పలు అనర్ధాలు కలుగుతాయంటూ ఆమె ప్రచారం చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా వెనిగండ్ల రాముపై ప్రశంసల జల్లులు కురిపించిన కుమారి ఆంటీ... ఆయన మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు లాంటి మనసున్న వ్యక్తి అని మొదలుపెట్టారు. అనంతరం... మహేశ్‌ బాబు ప్రజల కోసం ఆ సినిమాలో సేవ చేస్తే, రియల్ లైఫ్ లో గుడివాడ‌లో రాము సేవ చేస్తున్నార‌ని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా తన స్వస్థలమైన పెద్దఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

ఇక గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని చెప్పుకొచ్చిన కుమారి ఆంటీ... వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుంద‌ని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే.. తన స్వస్థలమైన గుడివాడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.

ఇదే సమయంలో... కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా లేవని దుయ్యబ‌ట్టిన కుమారి ఆంటీ... గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక, వెనిగండ్ల రాము చ‌క్కటి విజన్ ఉన్న నేత అని.. అటువంటి నేతలు అధికారంలో ఉంటే.. తమలాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు.