కుమారి ఆంటీ గొడవ మీకు ఎందుకు నాయనా?
ఆ సంగతి అలా ఉంటే... "కాదేదీ రాజకీయాలకు అనర్హం.. ఇక ఎన్నికల సీజన్ లో ఇది మరింత సహజం" అనే టైపులో అటు వైసీపీ, ఇటు టీడీపీలకు చెందిన జనాలు ఎంటరైపోయారు.
By: Tupaki Desk | 31 Jan 2024 6:15 PM GMTగత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ "కుమారి ఆంటీ" అనే విషయం ఫుల్ హాట్ టాపిక్! పని ఉన్నవారు.. చేస్తున్న పని మధ్యలో ఆపేసి ఆ విషయంపై చర్చ పెట్టగా.. పనీపాటా లేనివారి గురించి ఇక చెప్పేదేముంది!? ఏ ఇద్దరు కలుసుకున్నా ఈ విషయం గురించిన చర్చే! ఆమె వ్యాపారం గురించి.. అక్కడ దొరుకుతున్న ఫుడ్ గురించి.. తాజాగా ఆమె స్టాల్ ను ట్రాఫిక్ పోలీసులు మూయించేవరకూ!
అవును... ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ "కుమారి ఆంటీ". హైదరాబాద్ లోని బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన మాదాపూర్ లోని రోడ్ పక్కన భోజనాలు వండి విక్రయించడం ఆమె వ్యాపారం! వాస్తవానికి ఇలా కుమారి ఆంటీ లాంటి వారు జంట నగరాల్లో ఎంతో మంది ఉన్నారు. ఐటీ ప్రాంతాల్లోనూ, కనస్ట్రక్షన్ ఎక్కువగా జరుగుతున్న చోట్లా, నైట్ షిప్ట్స్ లో వర్క్ జరిగే ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫుడ్ స్టాల్స్ కి కొదవే లేదు!
అయితే... కుమారి ఆంటీ మాత్రమే ఫుల్ ఫేమస్! కారణం... యూ ట్యూబ్, ఇన్ స్టా గ్రాం మొదలైన సోషల్ మీడియా సైట్లలో ఆమె ఫుల్ ఫేమస్! ఎందుకలాగా అంటే..? "మనది మాస్ హిస్టీరియా మెంటాలిటీ కదండి" అని సరిపెట్టుకోవడమో.. లేక, మరో మాట ఏదైనా చెప్పుకోవడమో చేయాలి! ప్రస్తుతానికి అంతకు మించి ఈ సోషల్ మీడియాలో యుగంలో ఒక విషయానికి సంబంధించి సరైన కారణాన్ని, సహేతుకమైన కారణాన్ని విశ్లేషించడం అంత ఈజీ ఏమీ కాదు!
ఆ సంగతి అలా ఉంటే... "కాదేదీ రాజకీయాలకు అనర్హం.. ఇక ఎన్నికల సీజన్ లో ఇది మరింత సహజం" అనే టైపులో అటు వైసీపీ, ఇటు టీడీపీలకు చెందిన జనాలు ఎంటరైపోయారు. ఇందులో భాగంగా... సీఎం జగన్ తనకు మంచి చేశారని, ఇళ్లు ఇచ్చారని ఆమె చెప్పడం వల్లే ఇబ్బంది పెడుతున్నారంటూ వైసీపీ జనాలు ఆరోపించడం మొదలుపెట్టారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల గురించి చెప్పేదేముంది.. అలాంటప్పుడు రోడ్డు పక్కన వందల మంది గుమిగూడితే పోలీసులు అభ్యంతరం పెట్టక ఏమి చేస్తారు.. అంటూ టీడీపీ జనాలు సన్నాయినొక్కులు నొక్కారు! మరోపక్క రేవంత్ సర్కార్ పైనా, తెలంగాణ పోలీసులపైనా నెట్టింట విరుచుకుపడటం మొదలుపెట్టారు. పేదవారి పైనే ఈ ప్రభుత్వాలు, పోలీసుల ప్రతాపం అంటూ పెద్ద పెద్ద స్టేట్ మెంట్లే పెట్టారు!
ఈ విషయాలను గమనించిన రేవంత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అధికారులను ఆదేశించారు. కుమారి తన వ్యాపారాన్ని పాత స్థలంలోనే కొనసాగించ్చుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాపాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే కుమారి ఫుడ్ స్టాల్ ను తాను సందర్శిస్తానని సీఏం తెలిపారు.
దీంతో... రేవంత్ కు సోషల్ మీడియాలో ఫుల్ మైలేజ్ వచ్చేసిందనే కమెంట్లు వినిపించాయి!! ఇదే సమయంలో… "సమస్యను ఎవరు రేపారు.. మరెవరు విస్తరింపచేశారు అన్నది కాదు మేటరు. దాన్ని సరైన సమయంలో సరైన పరిష్కారం చూపిస్తూ.. ఎవరు ఆ ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకున్నారురు అన్నది పాయింట్" అంటూ "ముత్యాల ముగ్గు" సినిమాలో రావుగోపాల్ రావు డైలాగులకు అప్ డేటెడ్ వెర్షన్ రాస్తున్నారు నెటిజన్లు!
దీంతో... ఆమె ముందు మీడియా మైకులు వాలిపోయాయి!! ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె... "మాకు స్టాల్ తొలగించాలని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు.. నిన్న సుమారు 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది. నా ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారు.. మా కొడుకును పోలీసులు కొట్టారు.. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్పందించడం గొప్ప విషయం" అని ఆమె స్పందించింది.
కట్ చేస్తే... ఈ వ్యవహారంపై మేధావి వర్గంలో ఒక చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి హైదరాబాద్ జంట నగరాల్లో ఈ విధంగా రోడ్లపక్కన వ్యాపారాలు సాగించేవారు వేలల్లో వున్నారు. మరి పార్కింగ్ ప్లేస్ లను వీరు ఆక్యుపై చేసేస్తే... పార్కింగ్ అవసరం ఉన్న వాళ్ల సంగతి ఏమిటి? వీళ్ల వద్దకు వినియోగదారులు వచ్చినప్పుడు వారి వాహనాలనూ రోడ్లపైనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి?
ఇలా ఆలోచించడం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మానేశాయా అనే అనుమానం కలుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా జనాలు ఏది లైక్ కొడితే... మాస్ హిస్టీరియా మెంటాలిటీలో భాగంగా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సైతం అదే ఫాలో అయిపోతున్నారా అనే ప్రశ్నలూ తెరపైకి వస్తున్నాయి. ఏది తప్పో ఏది కరెక్టో.. ఏ సమస్యకు ఏది సరైన పరిష్కారమో ఆలోచించే విజ్ఞత నేతలు కోల్పోతున్నారా అనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఏది కరెక్ట్ అని నెటిజన్లు చెబితే అదే కరెక్ట్ అనుకుంటే... అంతకు మించిన అజ్ఞానం నేతలకు ఉండదనే మాటలు తదనుగుణంగా వినిపిస్తున్నాయి! ఇక హైదరాబాద్ లో ఫుట్ పాత్ లను ఆక్రమించిన చిరు వ్యాపారులను, రోడ్లపైన పెట్టుకున్న తోపుడు బండ్లను కదిలించే సాహసం ట్రాఫిక్ పోలీసులు చేయలేరేమో అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.
ఏది ఏమైనా... ఈ వ్యవహారం అంతటిలో అటు వైసీపీ జనాలు, ఇటు టీడీపీ నెటిజన్లు చేసిన రచ్చ వల్ల లాభపడింది మాత్రం ఇద్దరే ఇద్దరు!! ఒకరు తమ వ్యాపారానికి కొన్ని కోట్లు ఖర్చుపెట్టినా రానంత పబ్లిసిటీని సంపాదించుకున్న కుమారి ఆంటీ... ఇక ఆమె విషయమంలో స్పందించి సోషల్ మీడియాలో మరింతగా పొగడ్తల వర్షం దక్కించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!!