కుంభమేళాలో జన ప్రవాహం... ఎన్ని కోట్ల మందో తెలుసా?
ఈ నేపథ్యంలో.. జనవరి 13 నుంచి శుక్రవారం (ఫిబ్రవరి 14) సాయంత్రం 6 గంటల వరకూ భక్తుల సంఖ్య 50 కోట్ల మంది అని ప్రభుత్వం తెలిపింది.
By: Tupaki Desk | 15 Feb 2025 3:00 AM GMTమానవ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో అన్నట్లు.. ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా, సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదనే చర్చకు తెర లేచింది. ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతోన్న కుంభమేళాకు తండోప తండాలుగా తరలివస్తోన్న భక్తులు, పర్యాటకుల సంఖ్య శుక్రవారం సాయంత్రానికి సరికొత్త రికార్డులు సృష్టించిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
అవును... ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతోన్న కుంభమేళాకు నభుతో నభవిష్యతీ అన్నట్లుగా జన ప్రవాహం పోటెత్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా... మౌని అమావాస్య రోజైతే చెప్పేపనేలేదు. ఈ నేపథ్యంలో.. జనవరి 13 నుంచి శుక్రవారం (ఫిబ్రవరి 14) సాయంత్రం 6 గంటల వరకూ భక్తుల సంఖ్య 50 కోట్ల మంది అని ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలో శుక్రవారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకూ 92 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని చెప్పిన యూపీ ప్రభుత్వం.. అక్కడితో 50 కోట్ల మార్కు దాటిందని వెల్లడించింది. ఈ సందర్భంగా.. ప్రపంచ వ్యాప్తంగా భారత్, చైనా మినహా అమెరికా, రష్యాతో పాటు అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని పేర్కొంది.
ప్రధానంగా జనవరి 29న మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది ప్రయాగ్ రాజ్ కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. అదే రోజు తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది గాయపడినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరో 12 రోజుల పాటూ ఈ మహాకుంభమేళా కొనసాగనుంది.
కాగా... ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా ఈ ఏడాది జనవరి 13న మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది. ఇక ఈ కార్యక్రమానికి తొలుత 40 కోట్ల వరకూ రావొచ్చని అంచనా వేయగా.. ఇంకా 12 రోజులు మిగిలి ఉండగానే 50 కోట్ల మంది హాజరుకావడం గమనార్హం.