Begin typing your search above and press return to search.

ఏమిటీ కుంకీ ఏనుగులు.. పవన్ ఏపీకి ఎందుకు రప్పిస్తున్నారు?

అవును... పవన్ కల్యాణ్ స్వయంగా కర్ణాటకకు వెళ్లి, అక్కడ అటవీ శాఖ మంత్రితో ఈ కుంకీ ఏనుగుల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Aug 2024 4:08 AM GMT
ఏమిటీ కుంకీ ఏనుగులు.. పవన్  ఏపీకి ఎందుకు  రప్పిస్తున్నారు?
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల కర్ణాటక పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బీ. ఖంద్రేతో భేటీ అయ్యారు! అయితే... పవన్ ఈ కర్ణాటక పర్యటన చేపట్టింది కుంకీ ఏనుగుల కోసం అని తెలిసిన అనంతరం వాటిపై చర్చ మొదలైంది. ఏమిటీ కుంకీ ఏనుగులు, ఏమిటి వీటి ప్రత్యేక, ఇప్పుడు ఏపీకి ఇవి ఎందుకు అనే సెర్చ్ మొదలైంది.

అవును... పవన్ కల్యాణ్ స్వయంగా కర్ణాటకకు వెళ్లి, అక్కడ అటవీ శాఖ మంత్రితో ఈ కుంకీ ఏనుగుల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మొత్తం ఎనిమిది ఏనుగులు ఇవ్వాలని పవన్ వారిని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో... పవన్ కోరికకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే మామూలు ఏనుగులకూ, ఈ కుంకీ ఏనుగులకు ఏమిటి ప్రత్యేకత అనే సెర్చ్ అండ్ చర్చ మొదలైంది.

ఏమిటీ కుంకీ ఏనుగులు?:

ఏనుగులందు ఈ కుంకీ ఏనుగులు వేరయా అనే చెప్పాలి. సాధారణ ఏనుగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పలు రకాల పనులకు వాడతారు. ఇందులో భాగంగా అడవి ఏనుగులను ట్రాప్ చేయడం, చిక్కుయ్కున్న లేదా గాయపడిన ఏనుగులను రక్షించడం వంటివన్నమాట. ఇదే క్రమంలో... అడవి ఏనుగులు మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు వాటిని తరిమి కొట్టడానికి ఈ కుంకీ లను వాడతారు.

ఏపీకి ఎందుకంటే...?:

సరే కుంకీ ఏనుగుల ప్రత్యేకత సంగతి అలా ఉంచితే... వీటి అవసరం ఇప్పుడు ఏపీకి ఏమొచ్చింది అనేది మరో ప్రశ్న. అందుకు ఒక కీలకమైన కారణమే ఉంది. ఇటీవల కాలంలో జనావాసాల్లోకి వస్తున్న వన్య ప్రాణుల సంఖ్య పెరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు, పార్వతీపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు జనావాసాల్లోకి రావడం ఎక్కువగా జరుగుతుంది.

ఇలా ఏనుగులు గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి రావడం, పంటలు నాశనం చేయడం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలకు ప్రాణహాని కలిగిస్తుంటాయి. ఈ సమయంలో అలాంటి ఏనుగులను తిరిగి అడవుల్లోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రయత్నిస్తున్నా, సత్ఫలితాలు రావడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆ సమస్యకు సరైన పరిష్కారం చూపడానికే కుంకీ ఏనుగులు అవసరం అని అధికారులు పవన్ కి చెప్పడం, దీంతో ఆయన వెంటనే రియాక్ట్ అవ్వడం, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడటంతో ఈ కుంకీ ఏనుగుల వ్యవహారం తెరపైకి వచ్చి, వాటిపై చర్చ మొదలైందన్నమాట.