Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై కూనంనేని సంచలన వ్యాఖ్యలు!

తీరా మునుగోడులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందాక కమ్యూనిస్టులను కేసీఆర్‌ పట్టించుకున్న పాపాన పోలేదు

By:  Tupaki Desk   |   24 Aug 2023 8:22 AM GMT
కేసీఆర్‌ పై కూనంనేని సంచలన వ్యాఖ్యలు!
X

తమను నమ్మించి నిండా ముంచిన బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై తెలంగాణలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రగిలిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలను కేసీఆర్‌ చేరదీశారు. ఆ నియోజకవర్గంలో ఆ రెండు పార్టీలకు గట్టి పట్టు ఉండటంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి వాటిని వాడుకున్నారు. భవిష్యత్తులోనూ వాటితో పొత్తు కొనసాగుతుందన్నారు.

తీరా మునుగోడులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందాక కమ్యూనిస్టులను కేసీఆర్‌ పట్టించుకున్న పాపాన పోలేదు. కేసీఆర్‌ పంచన చేరి రెండో, మూడో సీట్లు సంపాదించుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని కమ్యూనిస్టులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. అయితే ఇటీవల కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తన పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో కమ్యూనిస్టులతో పొత్తు విషయం ఎక్కడా లేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీలకు దిమ్మతిరిగింది.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ చేసిన తప్పుతో కమిలి పోకుండా వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. సమరశీల పోరాటాలు చేసి గ్రామగ్రామానా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన తమ భావి ప్రణాళికను వివరించారు.

తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాల్లోని 30 సీట్లలో ప్రతిచోటా సీపీఐకి 10 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉందని కూనంనేని సాంబశివరావు తెలిపారు. 2004లో కాంగ్రెస్‌ తో, 2009లో టీడీపీతో కేసీఆర్‌ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికలో ఎవరు బలంగా ఉంటే వాళ్లతో పొత్తు పెట్టుకుని, తమను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు వెన్నుపోటు ఎలా పొడవాలి.. అధికారంలోకి ఎలా రావాలన్నదే బీఆర్‌ఎస్‌ పని అని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ కనీసం రాజకీయ విలువలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీని బలోపేతం చేయడానికి సెప్టెంబర్‌ 11 నుంచి మేం బస్సు యాత్ర చేస్తామన్నారు. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి సెప్టెంబర్‌ 17న ఎగ్జిబిషన్‌ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు.

తాము 'ఇండియా' కూటమిలో చేరి మిత్ర ధర్మం పాటించలేదని ఒక పత్రికలో రాశారని కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.‘ఇండియా’ కూటమిలో చేరడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలే పొత్తు నుంచి వైదొలిగాయని చెబుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు.. ఎందుకు ఒక్క సీటు ఇస్తామని తమతో సంప్రదింపులు జరిపారని నిలదీశారు.

సెప్టెంబర్‌ 17ను బంగారు అక్షరాలతో చరిత్రలో లిఖించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పి తర్వాత పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. దీనిపై కేసీఆర్‌ తన విధానం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. చరిత్రను వక్రీకరించకుండా ఒక కమిటీ వేయాలని కోరారు.

అయినా అవసరానికి వాడుకోవడం.. వదిలేయడంలో దిట్ట అయిన కేసీఆర్‌ తో కీడెంచి మేలెంచాలి అన్నట్టు వ్యవహరించకుండా.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుందని కమ్యూనిస్టు పార్టీల వ్యవహార శైలిపై విమర్శలు రేగుతున్నాయి.