కుప్పంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రోగ్రాంలో తలలు పగిలాయెందుకు?
గుడిపల్లి మండలస్థాయి పోటీల్లో భాగంగా కబడ్డీ.. వాలీబాల్.. ఖోఖో.. బ్యాడ్మింటన్.. క్రికెట్ పోటీల్ని ద్రవిడ విశ్వవిద్యాలయంలోని గ్రౌండ్ లో నిర్వహించారు.
By: Tupaki Desk | 11 Jan 2024 5:34 AM GMTఏపీ సర్కారు షురూ చేసిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుండగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగమైన కుప్పంలోని ద్రవిడ వర్సిటీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు షాకింగ్ గా మారాయి. రాష్ట్రం మొత్తం ఒకలాంటి పరిస్థితి ఉంటే.. అందుకు భిన్నంగా కుప్పంలో అందుకు భిన్నమైన పరిస్థితి ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. స్థానిక అంశాలే తప్పించి.. ప్రభుత్వానికి ఈ అంశంలో ఎలాంటి సంబంధం లేదన్న విషయం అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..
గుడిపల్లి మండలస్థాయి పోటీల్లో భాగంగా కబడ్డీ.. వాలీబాల్.. ఖోఖో.. బ్యాడ్మింటన్.. క్రికెట్ పోటీల్ని ద్రవిడ విశ్వవిద్యాలయంలోని గ్రౌండ్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా గుడుపల్లె.. కనమకపల్లి జట్ల మధ్య కబడ్జీ ఫైనల్ మ్యాచ్ మొదలైంది. ఈ టైంలో పోటీని చూస్తున్న ప్రేక్షకుల్లో.. కనమనపల్లికి చెందిన ఒక కుర్రాడు.. గుడిపల్లికి చెందిన జట్టు సభ్యుడితో గొడవకు దిగాడు.
దీంతో.. ఈ గొడవ అనూహ్యంగా పెరిగి పెద్దదైంది. చిలికిచిలికి గాలివానలా మారిన ఈ ఘర్షణ.. చివరకు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు రెండు వర్గాలుగా మారిపోయి కొట్టేసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో కాడేపల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తి తల పగలగా.. మరో వ్యక్తికి గాయమైంది. అదే సమయంలో కనమనపల్లికి చెందిన కొందరు కూడా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ గొడవను సర్దుబాబు చేసేందుకు రెండు గ్రామాలకు చెందిన పెద్ద మనుషులు రంగంలోకి దిగారు. కేసు నమోదు కాలేదు కానీ.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ జగన్ సర్కారును బద్నాం చేయాలన్నట్లుగా ప్రచారం చేస్తుండటం గమనార్హం