Begin typing your search above and press return to search.

కుప్పంలో వైసీపీ ప్రణాళిక వర్కవుట్‌ అవుతుందా?

వైసీపీ ఏపీలో ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు.. కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం.

By:  Tupaki Desk   |   11 May 2024 9:27 AM GMT
కుప్పంలో వైసీపీ ప్రణాళిక వర్కవుట్‌ అవుతుందా?
X

వైసీపీ ఏపీలో ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు.. కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం. ఈ నియోజకవర్గాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ నలుగురిని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో నారా లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ ను వైసీపీ ఓడించగలిగింది. చంద్రబాబు, బాలకృష్ణలను మాత్రం వైసీపీ పెనుగాలి వీచిన 2019 ఎన్నికల్లో ఓడించలేకపోయింది.

ఈసారి మాత్రం చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణలను ఓడించాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ అధినేత జగన్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. తమ హయాంలోనే కుప్పం మున్సిపాలిటీ అయ్యిందని, రెవెన్యూ డివిజన్‌ ను చేశామని ఇప్పటికే ఆయన పలుమార్లు చెప్పారు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంను మునిసిపాలిటీని కూడా చేయలేకపోయారని, రెవెన్యూ డివిజన్‌ ను కూడా చేసుకోలేకపోయారని జగన్‌ విమర్శించారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ప్రభుత్వంలో నంబర్‌ టూ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్‌ బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటికే పెద్దిరెడ్డి పలుమార్లు కుప్పంలో పర్యటించారు. చంద్రబాబును ఓడించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మునిసిపల్, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో 90 శాతం స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఈసారి అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోవాలని కృతనిశ్చయంతో ఉంది.

వైసీపీ తరఫున భరత్‌ పోటీ చేస్తున్నారు. వన్నికుల క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు ఈయన. పెత్తందారు అయిన చంద్రబాబుపై తాము బీసీ అభ్యర్థిని బరిలో నిలపామని ఆయనను గెలిపించాలని వైసీపీ కోరుతోంది.

అయితే 1989 నుంచి వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి చంద్రబాబు విజయం సాధించారు. ప్రతిసారీ ఆయన మెజారిటీ తగ్గుతుందే కానీ ఆయన ఎన్నికల్లో ఓడిపోయింది లేదు. కుప్పంలో చంద్రబాబుకు గట్టిపోటీ ఇస్తే ఆయన అక్కడి నుంచి కదలరని వైసీపీ భావించింది. తద్వారా చంద్రబాబుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి వీలుండదని లెక్కలు వేసుకుంది.

అయితే చంద్రబాబు కుప్పాన్ని తేలికగానే తీసుకున్నారు. ప్రచార బాధ్యతలను తన సతీమణి భువనేశ్వరికి అప్పగించారు. ఆమె పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకు సోదరుడు నందమూరి రామకృష్ణ సహకారం అందిస్తున్నారు. చంద్రబాబు కుప్పంను సతీమణి చేతుల్లో పెట్టి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు మూడు సభలు నిర్వహిస్తున్నారు. దీంతో వైసీపీ వ్యూహం బెడిసికొట్టిందనే టాక్‌ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఆయన వ్యూహాలు తమకు విజయం సాధించి పెడతాయని నమ్ముతోంది. మరి కుప్పం కోటను చంద్రబాబు నిలబెట్టుకుంటారా లేక వైసీపీ చేజిక్కించుకుంటుందా అనేది వేచిచూడాల్సిందే.