Begin typing your search above and press return to search.

కాకినాడ కన్నబాబు విశాఖలో రాజకీయ ఇన్నింగ్స్ ?

ఇపుడు ఆ జాబితాలో మరో పేరు వినిపిస్తోంది. ఆయనే కాకినాడ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 5:00 AM GMT
కాకినాడ కన్నబాబు విశాఖలో రాజకీయ ఇన్నింగ్స్  ?
X

విశాఖ అంటే అందరికీ మోజే. మరీ ముఖ్యంగా రాజకీయ జీవులు విశాఖనే ఎక్కువగా ఇష్టపడతారు. గడచిన మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర చూస్తే కనుక ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి వచిన వారినే విశాఖ ఆదరించింది. ఇపుడు కూడా విశాఖ నుంచి గెలిచిన వారిలో వారే అధికంగా ఉన్నారు.

దాంతో వైసీపీ నుంచి కొందరు నేతలు విశాఖ వైపు ఆశగా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలకు చెందిన వారు విశాఖలో తమ సరికొత్త రాజకీయ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఎక్కువగా జనసేన ప్రభావం కనిపిస్తోంది.

దాంతో పాటు టీడీపీ కూడా గట్టిగా ఉంది. ఈ రెండు పార్టీలు కట్టిన కూటమిని ఎదుర్కోవడం అక్కడ కష్టమే అన్న భావన ఉంది. దానికి తోడు బలమైన సామాజిక వర్గాలు కూటమిని అల్లుకుని ఉన్నాయి. ఈ మొత్తం పరిణామాలతో కొంతమంది వైసీపీ నుంచి కూటమి వైపుగా షిఫ్ట్ అవుతున్నారు. మరి కొందరు రాజకీయాలనే విరమించుకుంటున్నారు

ఇంకొందరు అయితే ఏకంగా ప్రాంతాన్నే మార్చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎక్కువగా విశాఖలో కనిపిస్తున్నారు. ఆయన విశాఖ నుంచి ఫ్యూచర్ పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారు అని ప్రచారం అయితే ఉంది.

ఇపుడు ఆ జాబితాలో మరో పేరు వినిపిస్తోంది. ఆయనే కాకినాడ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు. ఆయన కాకినాడ రూరల్ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయనను తాజా ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పంతం నానాజీ భారీ మెజారిటీతో ఓడించారు. అక్కడ కూటమి బలంగా ఉంది.

అయితే వైసీపీ అధినాయకత్వం మళ్లీ పార్టీకి మంచి రోజులు వస్తాయని చెబుతూ పార్టీ బాధ్యతలను అందరికీ అప్పగించింది. అలా కన్నబాబుని కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా చేసింది. అయితే ఆయన ఆ పదవిలో ఏమంత చురుకుదనం చూపించడం లేదు అని అంటున్నారు. ఆయన ఎక్కువగా మీడియా వైపు కూడా రావడం లేదు అని అంటున్నారు.

ఆ మధ్య ఒక దళిత డాక్టర్ మీద పంతం నానాజీ దుర్భాషలు ఆడిన ఘటన ఏపీవ్యాప్తంగా సంచలనం రేపింది. దాని మీద సొంత నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ మంత్రి కన్నబాబు పెద్దగా రియాక్ట్ కాలేదని అంటున్నారు. ఆ ఇష్యూతో ఎంతగానో చెలరేగిపోయి పొలిటికల్ మైలేజ్ ని సాధించాల్సిన చోట ఆయన ఎందుకో సైలెంట్ అయ్యారని అంటున్నారు.

దానికి కారణం కన్నబాబుకు అక్కడ రాజకీయాల మీద వైరాగ్యం కలగడమే అని అంటున్నారు. ఇక ఆయన ఓటమి తరువాత తరచూ విశాఖ వస్తున్నారు ఆ మధ్యన విశాఖ లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటే దానికి గానూ కీలక బాధ్యతలను పార్టీ కన్నబాబుకు అప్పగించింది. అయితే చివరి నిముషంలో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

అయితే అప్పటి నుంచే కన్న బాబు మనసు విశాఖ మీద పడింది అని అంటున్నారు. ఆయన తనకు అనువైన సీటుగా పెందుర్తిని చూసుకున్నారు అని చెబుతున్నారు. పెందుర్తిలో కన్నబాబు సామాజిక వర్గానికి చెందిన సామాజిక వర్గం బలంగా ఉంది. అక్కడ వైసీపీ కొంత వీక్ గా ఉంది. సరైన నాయకత్వం లేదు.

పెందుర్తిలో జనసేన గెలిచింది. పంచకర్ల రమేష్ బాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన క్రిష్ణా జిల్లా నుంచి వచ్చిన వారు. దాంతో తాను కాకినాడే కాబట్టి విశాఖ ఇంకా దగ్గరే అని కన్నబాబు భావిస్తున్నారు అని అంటున్నారు. ఇక కన్నబాబుకు విశాఖతో పరిచయాలు ఉన్నాయి. ఆయన పూర్వాశ్రమంలో విశాఖ నుంచి ఒక ప్రముఖ దిన పత్రికకు రిపోర్టర్ గా పనిచేశారు. విశాఖ రాజకీయ సామాజిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఆయనకు ఉంది అని అంటున్నారు. అలాగే ఆయన వైసీపీ హయాంలో విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రిగా కూడా పనిచేశారు.

దాంతో ఆయన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ద్వారా తన రాజకీయ బదిలీ విషయంలో జగన్ ముందుకు ప్రతిపాదనలు పెట్టారని అంటున్నారు. విశాఖ జిల్లాలో కూడా వైసీపీకి సరైన రాజకీయ నాయకత్వం కొరత ఉంది అని అంటున్నారు. మొత్తానికి జగన్ ఓకే చేస్తే కనుక కన్నబాబు కేరాఫ్ విశాఖ అవుతారు అని అంటున్నారు.