Begin typing your search above and press return to search.

కర్నూలు టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డికి తిక్క లేచింది? పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్

సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డికి కోపం వచ్చింది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 10:49 AM GMT
కర్నూలు టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డికి తిక్క లేచింది? పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్
X

సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డికి కోపం వచ్చింది. పార్టీ కోసం కష్టపడిన నేతలను వదిలేసి, నిన్న, మొన్న వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే పట్టం కడుతున్నారని ఎమ్మెల్యేలు, మంత్రులపై తన అసంతృప్తి వ్యక్తంచేశారు తిక్కారెడ్డి. ఇందుకోసమేనా యువనేత లోకేశ్ పాదయాత్ర, అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లారంటూ ఆయన నిలదీశారు.

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు, జైలుకు వెళ్లిన నాయకులను పక్కన పెడుతున్నారని తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం రోడ్డుపై పోరాడినోళ్లు, ఆర్థికంగా నష్టపోయినోళ్లు ఇప్పటికీ అలానే ఉన్నారని, కానీ, అధికారం కోసం ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వైసీపీ వాళ్లకి పెద్దపీట వేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకోసమేనా లోకేశ్ పాదయాత్ర, అధినేత జైలుకు వెళ్లిందంటూ నిలదీశారు.

రాయలసీమలోని కీలకమైన కర్నూలు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జిలుగా చెప్పుకుంటున్న నేతలు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడితే, అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ డిపో డీలర్ పోస్టుకు సైతం రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు లంచం అడుగుతున్నారని మండిపడ్డారు. మన కార్యకర్తల దగ్గర మనమే డబ్బు వసూలు చేస్తే ఎలా అంటూ తిక్కారెడ్డి వేసిన ప్రశ్నతో సమావేశంలో కలకలం రేగింది. లంచం ఎవడిస్తే వారికే పనులు చేస్తారా? పదవులు ఇస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో జరుగుతున్న తతంగం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తెలిస్తే బాధపడతారంటూ తిక్కారెడ్డి గుట్టు రట్టు చేయడం సంచలనంగా మారింది. జిల్లాలో వాస్తవ పరిస్థితులను అధినేత చంద్రబాబుకు నివేదిస్తానని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేస్తానని తిక్కారెడ్డి చెప్పారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడే ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో టీడీపీలో కలకలం రేగింది. మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ నేతలపై మడమతిప్పని పోరాటం చేసిన తిక్కారెడ్డి గత ప్రభుత్వ హయాంలో బులెట్ గాయాలకు గురయ్యారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించిన టీడీపీ నల్లగౌని రాఘవేంద్రరెడ్డిని బరిలోకి దింపింది. అయినప్పటికీ ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గెలుపొందారు. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు చూస్తున్న తిక్కారెడ్డి సంచలన ఆరోపణలు చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది.