Begin typing your search above and press return to search.

కూటమి డెసిషన్ : ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎపుడు...?

ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో మిగిలిన విషయాలు కూడా అలాగే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 Oct 2024 3:57 AM GMT
కూటమి డెసిషన్ : ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎపుడు...?
X

ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో మిగిలిన విషయాలు కూడా అలాగే ఉన్నాయి. ఒక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినపుడు ఒక విధానంగా ఉంటోంది. మరో పార్టీ వస్తే ఇంకో విధానం అమలు చేస్తున్నారు. విభజన ఏపీకి అలా ఒక ఆవిర్భావ దినోత్సవం అన్నది లేకుండా పోతోంది.

దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఇబ్బంది ఇది. విభజన తరువాత ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి పదమూడు జిల్లాలుగా ఆంధ్ర రాష్ట్రం 2014లో ఏర్పాటు అయింది. ఇక అపాయింట్ డే అని జూన్ 2 నుంచి అధికారికంగా అలా విడగొట్టారు. దాంతో తెలంగాణా ఆవిర్భావ వేడుకలను జూన్ 2వ తేదీని అధికారికంగా చేసుకుంటున్నారు.

వారు అలా చేసుకోవడం కూడా సబబు అని అంటున్నారు. ఎందుచేతనంటే తెలంగాణా రావాలని పెద్ద ఎత్తున దశాబ్దాల తరబడి ఉద్యమాలు చేశారు. చివరికి దానిని సాధించుకున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణా అన్నది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కాబట్టి అపాయింట్ డే అన్నది వారికే వర్తిస్తంది. అలా జూన్ 2 వారికే చెందుతుంది.

మరి విభజన తరువాత కూడా పూర్వ నామధేయంతో ఏపీ ఉంది. సో అలా కనుక చూస్తే ఏపీ పాత రాష్ట్రం కిందనే లెక్క. మరి ఏపీకి ఏ డేట్ ఆవిర్భావ దినోత్సవంగా ఉండాలి అన్నది 2014లోనే సందేహం వచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం జూన్ 2 నుంచి 9 వ తేదీ వరకూ వారం రోజుల పాటు నవ నిర్మాణ దినోత్సవ వేడుకలు అయిదేళ్ల పాటు నిర్వహించేవారు. అంతే తప్ప ఏపీ ఆవిర్భావ దినోత్సవం అన్నది ఆనాడు జరపలేదు.

పైగా జూన్ 2 అన్న్నది ఏపీకి ఒక చేదు అనుభవంగా అయిదు కోట్ల మంది ఆంధ్రులు భావిస్తూంటారు. వారు విభజన కోరుకోలేదు. కానీ ఫలితం అలాగే వచ్చింది. అటువంటపుడు ఆ జూన్ 2 ని ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అన్నది ఆంధ్రులలో బలంగా ఉంది. దానికి బదులుగా ఏపీ అవతరణ దినోత్సవంగా అక్టోబర్ 1ని గుర్తించి గౌరవించుకోవడం మంచిదని అపుడే చాలా మంది చెప్పారు. సలహా ఇచ్చారు.

ఆ డేట్ కి ప్రాధాన్యత ఏంటి అంటే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి పదకొండు జిల్లాల ఆంధ్ర రాష్ట్రం విడిపోయి 1953 అక్టోబర్ 1 న ఏర్పాటు అయింది. ఆ విధంగా చూస్తే ఇపుడు ఉన్న భౌగోళిక స్వరూపంతో రాష్ట్రం ఏర్పాటు అయిన తేదీ అదే కాబట్టి ఆ రోజే ఏపీ ఫార్మేషన్ డే అని చరిత్రకారులు కూడా చెబుతూ వచ్చారు.

ఒకవేళ అది కాకపోతే నవంబర్ 1న కూడా చేసుకోవచ్చు అని అన్న వారూ ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఏపీ 1956 నవంబర్ 1న ఏర్పాటు అయింది. అప్పటి హైదరాబాద్ స్టేట్ తో కలసి ఏర్పాటు అయింది. పైగా అరవై ఏళ్ల పాటు అలవాటు అయిన అవతరణ దినోత్సవం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు. కానీ నాటి బాబు ప్రభుత్వం ఈ రెండు డేట్లను పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

ఇక చూస్తే 2014 నుంచి 2019 మధ్యలో ఏపీ ఫార్మేషన్ డే అనేది లేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నవంబర్ 1 ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్స్వంగా గుర్తించింది. గత అయిదేళ్ళుగా అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అపుడు కూడా అక్టోబర్ 1 అన్నదే ఏపీకి సరైన ఫార్మేషన్ డే అన్న వారూ ఉన్నారు. అయినా ఇది కూడా బెటర్ డేట్ అని అన్న వారూ ఉన్నారు.

ఇపుడు చూస్తే నవంబర్ 1 దగ్గరలో ఉంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం గురించి మంత్రులతో ప్రస్తావించారు అని ప్రచారం సాగింది. నవంబర్ 1 ని చేయాలా లేక అక్టోబర్ 1ని చేయాలా లేక గతంలో మాదిరిగా జూన్ 2 న నవ నిర్మాణ దినోత్సవంగా పాటించాలా అన్నది ఆయన ఆలోచనను మంత్రుల ముందు పెట్టి వారి సలహాలను కోరారు.

అయితే మంత్రులు ఏ విధంగా ఆలోచించి చెబుతారో కానీ గత అయిదేళ్ళుగా ఉన్నట్లుగా నవంబర్ 1 నే కంటిన్యూ చేస్తే తప్పేంటి అన్న మాట ఇపుడు వినిపిస్తోంది. జగన్ ప్రభుత్వ విధానాలను తిరగతోడడం వరకూ ప్రభుత్వం చేస్తే చేసి ఉండవచ్చు కానీ చరిత్రలో ఉన్న అంశాలు అందునా రాష్ట్రం పుట్టిన రోజు వంటి సున్నితమైన అంశాల విషయంలో కూడా పునరాలోచన చేయడం అన్నది మంచి విధానం కాదని అంటున్నారు. మరి నవంబర్ 1ని కూటమి ప్రభుత్వం అవతరణ దినోత్సవంగా చేస్తుందా లేదా అన్నది కొద్ది రోజులలో తెలుస్తుంది.