దారితప్పిన ఎమ్మెల్యేలు.. ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ!
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
By: Tupaki Desk | 28 Aug 2024 7:30 AMఏపీలో కూటమి సర్కారుకు పెద్దపాత్ర పోషిస్తున్న టీడీపీలో ఎమ్మెల్యేలు కట్టుబాట్లు మరుస్తున్నారు. మళ్లీ 2014-19 మధ్య చెలరేగినట్టే చెలరేగుతున్నారు. పైకి సౌమ్యంగా ఉన్నవారు కూడా.. ఇప్పుడు దారి తప్పేస్తున్నారు.. కూటమి పెద్ద.. సీఎం చంద్రబాబుకు తలనొప్పులు తీసుకువస్తున్నారు. ఒకరిని హెచ్చరించి వదిలేస్తే.. మిగిలిన వారు లైన్‌లోకి వస్తారని అనుకుంటే.. ఇప్పుడు మిగిలిన వారు కూడా అదే దారి పడుతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి: చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడైన రాం ప్రసాద్ సతీమణి కొన్నాళ్ల కిందట నిర్వహించిన కార్యక్రమంలో పోలీసులను తిట్టిపోశారు. ఇదేమన్నా వైసీపీ పాలన అనుకుంటున్నావా.. డోర్ తీయాలని తెలియదా.. అంటూ ఇంగ్లీష్‌లో బలంగా తిట్టిపోశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగగా చంద్రబాబు హెచ్చరించి వదిలేశారు. కానీ, ఇప్పుడు మరో నేత సతీమణి వివాదంగా మారారు.
ప్రత్తిపాటి పుల్లారావు: చిలకలూరి పేట ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ప్రత్తి పాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ.. అధికారులను తన దైన శైలిలో హెచ్చరిస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేసిన ఆగడం అంతా ఇంతా కాదు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో నేరుగా ఇంటికే కేకు తెప్పించుకుని వారి సమక్షంలో నే కట్ చేయించి.. సంబరాలు చేసుకున్నారు. ఇది తీవ్ర దుమారం రేపింది.
బొజ్జల సుధీర్ రెడ్డి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న యువ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి.. స్థానికంగా జరుగుతున్న ఇసుక అక్రమాలకు వంత పాడుతున్నారు. తన వారిని టచ్ చేయొద్దని పోలీసులకు, ఇతర అధికారులకు ఆయన హుకుం జారీ చేశారు. అయితే.. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన మీడియా ప్రతినిధిని బెదిరించారు. కథ ఇక్కడితో కూడా ఆగలేదు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన మీడియాను బ్యాన్ చేయాలంటూ.. స్థానిక కేబుల్ ఆపరేటర్లకు ఆయన ఫోన్లు చేశారనేది ప్రస్తుతం వినిపిస్తున్నవార్త.
గల్లా మాధవి: గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన గల్లా మాధవి భర్త ఇప్పుడు టాక్ ఆఫ్‌ది టౌన్ అయ్యారు. భార్య ఎమ్మెల్యే కావడంతో గతంలో చేసుకున్న భూముల ఒప్పందాన్ని పక్కన పెట్టి.. ఓ సాధారణ రైతును బెదిరించి.. భూములు కొట్టేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు.. చంపేస్తామని బెదిరించారు. 4 ఎకరాలను ఎకరాకు రూ. 40 లక్షల చొప్పున ఒప్పందం చేసుకుని.. 30 లక్షలు ఇచ్చి.. మొత్తం కొట్టేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడిపైనే కేసులు పెట్టించారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వెలుగుచూస్తున్నవే పదుల సంఖ్యలో ఉంటే.. వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉండడం గమనార్హం.