వైరల్ అవుతున్న వీడియో.. కూటమి సర్కారు కళ్లు తెరవాలి..!
మంచో చెడో ఏదైనా సరే.. కొన్ని కొన్ని విషయాలను పట్టించుకోకుండా వదిలేస్తే.. అది మొదటికే మోసం చేస్తుంది.
By: Tupaki Desk | 2 Oct 2024 3:42 AM GMTమంచో చెడో ఏదైనా సరే.. కొన్ని కొన్ని విషయాలను పట్టించుకోకుండా వదిలేస్తే.. అది మొదటికే మోసం చేస్తుంది. గతంలో వైసీపీ హయాంలోనూ ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సీఎంగా ఉన్న జగన్ ఏమా త్రం పట్టించుకోలేదు. ప్రతిపక్షం తమపై దాడి చేస్తోందంటూ కొట్టిపారేశారు. ఫలితంగా.. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో ఓడిపోయారు. కట్ చేస్తే.. ఇప్పుడు కూటమి సర్కారు పైనా కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ముఖ్యంగా సామాన్య ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు వీడియోల రూపంలో వెలుగు చూస్తున్నాయి. భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయినా.. కూటమి సర్కారు పెద్దలు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇది వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందనేది సర్వత్రా జరుగుతున్న చర్చ. వైరల్ అవుతున్న వీడియోలో విజయవాడ, కాకినాడలలో వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వారి ఆవేదన కళ్లకు కడుతోంది.
క్షేత్రస్థాయిలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. విజయవాడను తీసుకుంటే.. 72 వేల కుటుంబాలు(2 లక్షల మంది ప్రజలు) వరద కారణంగా సర్వస్వం కోల్పోయాయి. వీరిని ఆదుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. కానీ, వరద సాయానికి గడువు విధించిన(సెప్టెంబరు 30 లాస్ట్ అని చంద్రబాబు చెప్పారు) సమయానికి కనీసం 20 వేల కుటుంబాలకు కూడా పరిహారం అందించలేక పోయారు. కొందరి పేర్లు జాబితాలో ఉన్నా.. డబ్బులు పడలేదు. మరికొందరి పేర్లను తొలగించారన్న విమర్శలు కూడా వున్నాయి.
దీనికితోడు.. సైట్లను ఆపేయడం.. ఎన్యూమరేషన్ సరిగా లేకపోవడంతో బాధితులు కళ్లనీళ్లు పెట్టుకుంటు న్నారు. ఇంకోవైపు.. తమకు గతంలో సమాచారం ఇచ్చేందుకు వలంటీర్లు అందుబాటులో ఉండేవారు. ఏం అడిగినా చెప్పేవారు.. కానీ, ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేకుండా పోయింది. బాధితులకు సమాచారం అందడం లేదు. ఇస్తారో.. ఇవ్వరో చెప్పేవారు కూడా లేరు. దీంతో వారంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా.. వారి గోడును ఎవరూ వినిపించుకోవడం లేదన్నది వాస్తవం.
ఈ విషయాలపైనే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నారు. వీటిని ఇప్పటికైనా కూటమి సర్కారు పెద్దలు పట్టించుకోవాల్సి ఉంది. లేకపోతే.. ప్రజల్లో వ్యతిరేక భావన పెరిగిపోయి.. సర్కారు తమకు అన్యాయం చేసిందనే వాదనను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది.