Begin typing your search above and press return to search.

"36 హత్యలు"... ఈ మాట మళ్లీ వినిపించట్లేదెందుకు?

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 50 రోజుల్లో 36 హత్యలు జరిగినట్లుగా ప్రచారం చేశారు

By:  Tupaki Desk   |   31 July 2024 7:30 AM GMT
36 హత్యలు... ఈ మాట మళ్లీ వినిపించట్లేదెందుకు?
X

అబద్దానికి నిజానికి మధ్యనున్న తేడా ఇదే. కొద్ది రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఒక అంశం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరూ ఆంధ్రపదేశ్ గురించి మాట్లాడుకునేలా చేసింది. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 50 రోజుల్లో 36 హత్యలు జరిగినట్లుగా ప్రచారం చేశారు. ఆ మాటకు వస్తే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేతతో పాటు మరికొందరు గళం విప్పారు. వీరికి అండగా ఇండియా కూటమిలోని కొన్ని పార్టీ అధినేతలు సైతం ఇదే అంశాన్నిప్రస్తావించటంతో ఏపీలో ఏం జరుగుతోంది? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంత దారుణంగా దెబ్బ తిన్నాయా? అన్న భావన కలిగింది.

అయితే.. ఈ అంశంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి.. జరుగుతున్న ప్రచారానికి.. వాస్తవానికి మధ్యనున్న అంతరాన్ని గుర్తించి గళం విప్పే సమయానికి జరగాల్సిన నష్టం జరిగింది. పల్నాడు జిల్లాలోచోటు చేసుకున్న వైసీపీ కార్యకర్త హత్య కేసును టేకప్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటిపోయాయని.. రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎత దారుణంగా ఉన్నాయో తెలుసా? అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో యావత్ దేశం ఒకసారి ఏపీ వైపు చూసింది. ఆయన చెబుతున్నట్లుగా యాభై రోజుల్లో 36 రాజకీయ హత్యలు చోటుచేసుకున్నాయని.. వీటిపై తక్షణమే స్పందించాల్సిఉందని పేర్కొన్నారు. ఏపీ ఇమేజ్ దారుణంగా దెబ్బ తింటున్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఏపీ అసెంబ్లీలో స్లైడ్ షో వేయటంతో పాటు.. హత్యకు గురైనట్లుగా చెబుతున్న 36 మంది బాధితుల వివరాలు ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే.. ఏపీ హోంమంత్రి అనిత సైతం హత్యకు గురైన 36 మంది జాబితా ఇస్తే.. తక్షణం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన 36 హత్యలు గురించి మాట్లాడి.. తీవ్ర విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. దీనికి స్పందించిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్.. హత్యలకు సంబంధించిన ఆధారాలు.. బాధితుల వివరాల్ని ఇవ్వాలని.. అప్పుడు మాత్రమే మాట్లాడాలని అడ్డుకట్ట వేశారు. కట్ చేస్తే.. ఇన్ని రోజులు అవుతున్నా హత్యల గురించి మాట్లాటం లేదు.. ఆ మాటకు వస్తే.. వైసీపీకి చెందిన ఎవరూ కూడా 50 రోజుల్లో 36 హత్యల మాట ఇప్పుడు ఎవరి నోటి నుంచి రావట్లేదు. దీనికి కారణం.. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒకే ఒక్క ప్రశ్న.. హత్యకు గురైనట్లుగాచెబుతున్న 36 మంది ఎవరు? ఎక్కడ? వారి పేర్లు ఏమిటి? అన్నదే. ఈ మొత్తం ఎపిసోడ్ తో అర్థమయ్యే అంశం ఏమంటే.. అనుక్షణం అప్రమత్తంగా లేకున్నా జరిగే డ్యామేజ్ భారీ అని. మరి.. ఆ విషయాన్ని కూటమి సర్కారు గుర్తించిందంటారా?