ఉద్యోగుల సెగ.. కూటమి సర్కారుకు చిక్కులే!
ఇక, కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి రెండు మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గళం విప్పుతున్నారు.
By: Tupaki Desk | 27 Aug 2024 3:55 AM GMTఏపీలో ఉద్యోగ సంఘాలు గళం విప్పుతున్నాయి. గత ఐదేళ్లలో ఉద్యోగ సంఘాలు సాధించలేకపోయిన కీలక అంశాలను ఇప్పుడు సాధించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా పీఆర్సీ సహా ఐఆర్(మధ్యంతర భృతి), పింఛన్ల పథకం వంటివాటి విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య తీవ్ర వివాదాలు నడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే వైసీపీ ప్రభుత్వంపై అప్పట్లో ఉద్యోగులు నిప్పులు చెరిగారు. ఇది ఎన్నికల సమయానికి మరింత పెరిగి వైసీపీ ఓటమికి కూడా దారి తీసింది. ఇక, కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి రెండు మాసాలు మౌనంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు గళం విప్పుతున్నారు.
ప్రధానంగా 12వ పీఆర్సీ వేసేలోగా.. ఐఆర్‌ను నిర్ణయించి.. తమకు ఇవ్వాలన్నది ఉద్యోగులు చెబుతున్న మాట. గత ప్రభుత్వం లో జరిగిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు.. ఈ దఫా ఆది నుంచే సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్ప డు తొలి ఆరు నుంచి 8 మాసాల వరకు ఉద్యోగులు సైలెంట్‌గానే ఉంటారు. కానీ, ఈ సారి మాత్రం దీనికి విరుద్ధంగా తొలి మూడు మాసం నుంచే ఒత్తిళ్లు ప్రారంభించడం.. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతుండడంతో కూటమి సర్కారుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇదిలావుంటే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినా.. దీనికి ముందు జరిగిన అసైన్డ్ భూముల లావాదేవీలను కూటమి ప్రభుత్వం విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనికి బాధ్యులుగా తొలుత అధికారులను పేర్కొంటూ వారిపై చర్యలకు ఉపక్ర మిస్తోంది. దీనిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గత ప్రభుత్వం చెప్పిన మేరకే తాము పనిచేశామని.. దీనిలో తమ తప్పులేదని.. తమవారిపై చర్యలు తీసుకుంటే ఎలా అన్నది సంఘాల నేతల మాట.
దీనికితోడు ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది చేయాలా? వద్దా? అన్నది ఈ చర్యలను బట్టి ప్రశ్నార్థకంగా మారుతాయని.. ఇలాంటి కేసులు తమ ఉద్యోగులను భయానికి గురి చేస్తాయన్నది సంఘాల మాట. ఇలా.. అటు ఆర్థికంగా.. ఇటు సమస్యల పరంగా కూడా ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడం గమనార్హం. మరి దీనిపై కూటమి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.