టార్గెట్ వైసీపీ : టీడీపీ జనసేన మాస్టర్ ప్లాన్ ?
ఏపీలో వైసీపీ ఓడింది కానీ ఏకంగా 40 శాతం ఓటు షేర్ ఉంది. ఆ పార్టీ ఈ రోజుకీ బలమైన ప్రత్యర్థి గానే ఉంది
By: Tupaki Desk | 28 July 2024 1:30 AM GMTఏపీలో వైసీపీ ఓడింది కానీ ఏకంగా 40 శాతం ఓటు షేర్ ఉంది. ఆ పార్టీ ఈ రోజుకీ బలమైన ప్రత్యర్థి గానే ఉంది. దానికి కారణం ఉమ్మడి పదమూడు జిల్లాలలో వైసీపీకి ఉన్న క్యాడర్. ఆ పార్టీకి ఉన్న ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు. వారి వల్లనే వైసీపీ ఈ రోజుకీ పటిష్టంగా ఉంది. అంతే కాదు ఏపీలో ఉన్న వందకు పైగా మున్సిపాలిటీలు. అలాగే కార్పోరేషన్లు జెడ్పీ చైర్మన్ పదవులు అన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి.
వార్డు మెంబర్ల నుంచి మొదలుపెడితే సర్పంచుల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వైసీపీకి నూటికి ఎనభై మంది దాకా ఉన్నారు. పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు గెలవకపోవచ్చు కానీ ఆ తర్వాత జిల్లా మండల గ్రామ స్థాయిలో సాగే పాలన అంతా వైసీపీ ఏలుబడిలోనే ఉంది. దాంతో వైసీపీని దెబ్బకొట్టాలని టీడీపీ జనసేన చూస్తున్నాయని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ కోరి మరీ పంచాయతీ రాజ్ శాఖను ఎంచుకోవడం వెనక గ్రామ సీమలలో గ్రాస్ రూట్ లెవెల్ లో తమ పార్టీని పటిష్టం చేసుకోవడానికే. ఈ శాఖ పరిధిలోనే సర్పంచులు, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్లు వస్తారు. ఇపుడు వారందరినీ తమ వైపునకు తిప్పుకోవడానికి పవన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు అని అంటున్నారు.
దానికి వైసీపీ కూడా కారణం అని అంటున్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా దారి మళ్ళించి వాటిని నిర్వీర్యం చేసింది అన్న ఆగ్రహం వారికి ఉంది. ఇపుడు చూస్తే కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనలో ఏదో ఒకటి చేయాలన్నా పేరు తెచ్చుకోవాలన్నా కూటమికి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి సర్పంచులతో పాటు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల మీద ఉంది.
దాంతో ఏపీలో కొత్త రాజకీయానికి తెర లేస్తోంది. వైసీపీని పూర్తిగా దెబ్బ తీయడానికి టీడీపీ జనసేన రచిస్తున్న ఈ వ్యూహం సక్సెస్ అయితే మాత్రం వైసీపీ దారుణంగా దెబ్బతింటుంది అని అంటున్నారు. అదెలా అంట్రే గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న వైసీపీ క్యాడర్ తో పాటు ద్వితీయ తృతీయ స్థాయి నేతలు అంతా జనసేనలోకి వెళ్లేలా ఎత్తుగడలు సాగుతున్నాయి.
అదే సమయంలో కీలక నేతలు ఎమ్మెల్యే స్థాయి నాయకులు అంగబలం అర్ధం బలం ఉన్న వారు అంతా టీడీపీలో చేరేలా పధక రచన చేస్తున్నారు. దీనిని సింపుల్ గా చెప్పుకోవాలి అంటే లీడర్లు అంతా టీడీపీలోకి క్యాడర్ జనసేనలోకి అని అంటున్నారు. జనసేన గోదావరి జిల్లాలలో బలంగా ఉంది. ఉత్తరాంధ్రాలో విశాఖలో బాగా ఉంది. అయితే మిగిలిన చోట్లతో పాటు రాయలసీమలోనూ జనసేన జెండా ఎగిరేలా పవన్ పావులు కదుపుతున్నారు.
జనసేన రానున్న కాలంలో ఏపీలో వైసీపీని రీప్లేస్ చేసే విధంగా పవన్ బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. దానికి టీడీపీ కూడా సహకరిస్తోంది. ముందు వైసీపీని నిర్వీర్యం చేస్తే జనసేన బలపడినా తప్పులేదు అన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ఏపీలో చూస్తే కనుక వైసీపీని 2029 ఎన్నికల నాటికి లేవకుండా కోలుకోలేని దెబ్బ తినిపించాలని కూడా జనసేన టీడీపీ కలసి కట్టుగా ప్లాన్స్ వేస్తున్నాయని అంటున్నరు.
తొందరలో స్థానిక సంస్థల మీద చేసిన ప్రత్యేక చట్టాన్ని సవరించడం కనుక చేస్తే ఏపీలో వైసీపీ బలం పూర్తిగా నీరుకార్చవచ్చు అని చూస్తున్నారు. అదెలా అంటే లోకల్ బాడీస్ లో ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులను పెద్ద ఎత్తున కూటమి వైపునకు తిప్పుకుని టీడీపీ జనసేనలలో చేర్చుకుంటారని అంటున్నారు. దాంతో గ్రాస్ రూట్ లెవెల్ దాకా వైసీపీని లేకుండా షాక్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు.
అయితే ప్రజాస్వామ్యంలో నాయకులు పోయినా పార్టీ బతికి ఉంటుంది కానీ క్యాడర్ పోతే బతికి బట్ట కట్టడం కష్టం. ఏకంగా వైసీపీ కూశాలే కదిలిపోయే విధంగా టీడీపీ జనసేన కలసి రచిస్తున్న ఈ వ్యూహానికి విరుగుడు మంత్రం వైసీపీ దగ్గర ఉందా తమ పార్టీ క్యాడర్ ని కనుక వైసీపీ కాపాడుకోలేకపోతే ఇబ్బందులలో పడుతుందని అంటున్నారు. జగన్ నాయకుడిగా జనాదరణతో ఉండొచ్చు కానీ క్యాడర్ చెల్లాచెదురైతే మాత్రం పార్టీని తిరిగి పునర్ నిర్మించుకోవడం బహు కష్టమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.