Begin typing your search above and press return to search.

కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు !

ఇందులో 23 మంది కేరళ, ఏడుగురు తమిళనాడు, ముగ్గురు ఏపీ, ఒకరు కర్ణాటక కాగా మిగిలిన వారంతా ఉత్తరాది రాష్ట్రాల వారు

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:38 AM GMT
కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు !
X

జూన్ 12న తెల్లవారు జామున కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 49 మందిలో 45 మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 23 మంది కేరళ, ఏడుగురు తమిళనాడు, ముగ్గురు ఏపీ, ఒకరు కర్ణాటక కాగా మిగిలిన వారంతా ఉత్తరాది రాష్ట్రాల వారు.

అయితే ఆ ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకుని మంచిర్యాల జిల్లాకు చెందిన కొట్టె గంగయ్య అనే వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇతనితో పాటు సిరిసిల్ల జిల్లా నెరేళ్ల, మెదక్ జిల్లా దుబ్బాక కు చెందిన ఇద్దరు మొదటి అంతస్తు నుంచి లుంగీల సాయంతో కిందకు దిగారు. ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించి పంపించారు.

మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొట్టె గంగయ్య (49) కువైట్ లోని 'హైవే సూపర్ మార్కెట్' లో గత పన్నెండు ఏళ్లుగా హెల్పర్ గా పనిచేస్తున్నాడు.

సూపర్ మార్కెట్ యాజమాన్యం తన సిబ్బంది కోసం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లో వసతి సౌకర్యం (లేబర్ అకామడేషన్) ఏర్పాటు చేసింది.

రెండవ అంతస్తులో ఒక రూములో గంగయ్యతో పాటు మరో తెలుగు వ్యక్తి, ఇద్దరు కేరళ వాళ్ళు ఉంటున్నారు. ఆరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్లాల్సిన ఒక కేరళ అతను ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి వచ్చి 4.15 గంటలకు కేకలు వేయడంతో మిగతా ముగ్గురు ఘాడ నిద్ర నుంచి లేచారు. గది బయటకు వచ్చి చూడగా దట్టమైన పొగ, చిమ్మ చీకటి. గంగయ్య రూమ్మేట్స్ ముగ్గురు రెండవ అంతస్తు నుంచి కిందికి దూకారు.

రెండవ అంతస్తు నుంచి కిందికి దూకడానికి ధైర్యం చాలని గంగయ్య తన మొబైల్ ఫోన్ లోని టార్చ్ లైట్ వెలుగులో పరిసరాలను గమనించాడు. దట్టమైన పొగ వలన కళ్ళు మండినా, చిమ్మ చీకటిలో గోడను పట్టుకుని మెల్ల మెల్లగా కిటికీ వద్దకు వెళ్లి కేబుల్ వైరు సహాయంతో కింది అంతస్తు లోని రేకులపై దూకాడు. పక్క బిల్డింగ్ వాళ్ళు వేసిన నిచ్చెన సాయంతో కిందికి దిగాడు.

ఆసుపత్రిలో చేరిన గంగయ్యకు స్కానింగ్, ఎక్స్-రే తదితర పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు. శరీరానికి అక్కడక్కడ చిన్న గాయాలయ్యాయి. టెన్షన్ లో గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం లాంటివి జరిగాయి. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. మొత్తానికి దేవుడి దయవల్ల బతికి బట్టకట్టామని బాధితులు చెబుతున్నారు.