ఇప్పుడు అదానీ మీద కేసు మాదిరే.. అప్పట్లో కేవీపీపైనా?
తాజాగా అదానీ మీద నమోదైన కేసు మాదిరే..దశాబ్దాల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మీద నమోదైంది.
By: Tupaki Desk | 22 Nov 2024 4:15 AM GMTదేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికి.. వారెవరిపైనా రాని ఆరోపణలు.. చోటు చేసుకోని సంచలనాలు అదానీ గ్రూప్ మీద వస్తుండటం తెలిసిందే. మొన్నటికి మొన్న హిండెన్ బర్గ్ ఎపిసోడ్ చేసిన ఆర్థిక విధ్వంసం సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో నమోదైన కేసు స్టాక్ మార్కెట్ ను.. దేశీయ కార్పొరేట్ ప్రపంచాన్ని భారీ కుదుపునకు గురి చేసింది. ఆసక్తికర విషయం ఏమంటే.. తాజాగా అదానీ మీద నమోదైన కేసు మాదిరే..దశాబ్దాల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మీద నమోదైంది.
ఇప్పుడు అదానీ మీద ఏ తీరులో అయితే లంచాల ఆరోపణలు ఉన్నాయో.. అప్పట్లో కేవీపీ మీదా ఇదే తరహాలో తీవ్ర ఆరోపణ ఉండేది. మన ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందజేసేందుకు ఉక్రెయిన్ వ్యాపారి అమెరికాను కేంద్రంగా చేసుకున్నట్లుగా అప్పట్లో కేసు నమోదైంది. ఇప్పుడు అదానీ సైతం అగ్రరాజ్యం కేంద్రంగా కథను నడిపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదానీపై నమోదైన తీవ్రమైన అభియోగం.. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు సొంతం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పెద్దలకు ముడుపులు చెల్లించేందుకు రూ.2029 కోట్ల భారీ మొత్తాన్ని అమెరికా నుంచి మళ్లించినట్లుగా అదానీపై అభియోగాలు నమోదు కావటం తెలిసిందే.
అదానీ ఇష్యూలో క్లారిటీ సరే..మరి అప్పట్లో కేవీపీపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? ఏ కారణంగా కేసు నమోదైంది? అదిప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర సమాధానాలు వస్తాయి. ఏపీలోని కోస్తా తీరంలో టైటానియం తవ్వకాల లైసెన్సులు పొందేందుకు ఉక్రెయిన్ కు చెందిన వ్యాపారి డిమిత్రి ఫిర్తాస్18.5 మిలియన్ డాలర్ల ముడుపులను అమెరికా నుంచి చెల్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా టైటానియం ఉత్పత్తుల అమ్మకాలతో 500 మిలియన్ డాలర్లు అర్జించాలన్న ప్రయత్నాలు జరిగినట్లుగా పేర్కొన్నారు.
స్విట్జర్లాండ్ కు చెందిన బోత్లీ ట్రేడ్ కంపెనీ.. అప్పటి ఏపీ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఒక కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఒక డీల జరిగింది. ఇదంతా 2007లో (దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది) జరిగిన డీల్ ప్రకారం ఏడాదికి 5-12 మిలియన్ పౌండ్ల విలువైన టైటానియం స్పాంజ్ ను భారత్ కు చెందిన పేరు తెలియని కంపెనీ నుంచి అమ్మేందుకు రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వాల అనుమతులు అవసరమయ్యాయి. ఇందులో వైఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేవీపీతో పాటు.. పలువురు అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందజేసినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు నేరారోపణలు మోపాయి.
ఈ ఇష్యూలో ఉక్రెయిన్ వ్యాపారితో పాటు కేవీపీపైనా అమెరికా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఎఫ్ బీఐ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. దాని అమలు బాధ్యతను సీబీఐ తీసుకోవాలని కోరింది. ఇదే సమయంలో దీనిపై స్పందించిన కేవీపీ హైకోర్టును ఆశ్రయించారు. రెడ్ కార్నర్ నోటీసుల్ని నిలిపేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు పొందారు. అలా కేవీపీ మీద నమోదైన కేసు వ్యవహరం అక్కడితో ఆగింది. మరి.. అదానీ విషయంలో తాజాగా నమోదైన కేసు.. ఎక్కడి వరకు వెళుతుందన్నది చూడాలి.