Begin typing your search above and press return to search.

వైఎస్సార్ జయంతి వేళ బాంబు పేల్చిన కేవీపీ

పెద్దాయనగా అంతా పిలుచుకునే వైఎస్సార్ 75వ జయంతిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   8 July 2024 8:03 AM GMT
వైఎస్సార్ జయంతి వేళ బాంబు పేల్చిన కేవీపీ
X

పెద్దాయనగా అంతా పిలుచుకునే వైఎస్సార్ 75వ జయంతిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. వైఎస్సార్ కి తెలుగు నాట ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. వైసీపీ కాంగ్రెస్ పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ ఆత్మగా పేరు పడిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఒక పెద్ద బాంబునే పేల్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే వైసీపీ నుంచి చాలా మంది నాయకులు తనతో టచ్ లో ఉన్నారని.

వారంతా వైఎస్సార్ కేబినెట్ లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే అని అంటున్నారు. ఇపుడు వారంతా తనతో సంప్రదిస్తున్నట్లుగా కేవీపీ చెప్పుకొచ్చారు. వారు ఇపుడు చాలా మంది వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్న వారు కేవీపీని సంప్రదించడం ఎందుకు అంటే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడానికే అని అంటున్నారు.

ఇదే విషయం కేవీపీ చెబుతూ వారంతా కాంగ్రెస్ లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. దాంతో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలోనే నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన చేస్తోందని అర్ధం అవుతోంది.

వైసీపీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. దాంతో ఆ పార్టీ కొత్త దారి ఏమిటి అన్నది తెలియక ఇబ్బందుల్లో ఉంది. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ శర వేగంగా పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి నేతలకు గాలం వేస్తోంది. పాత వారిని అందరినీ తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని ఆ పార్టీ ఆలోచనగా ఉంది.

అదే టైంలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో గ్రాఫ్ పెరిగింది. ఈ ఎన్నికల్లోనే బీజేపీకి సొంతంగా సీట్లు దక్కలేదు. దాంతో 2029 నాటికి కచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తుంది అని ఒక అంచనా ఉంది. దానినే ఏపీలో కూడా ట్రంప్ కార్డుగా వాడుకుంటూ వీలైనంత మందిని వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి లాగేయాలని ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు.

దీని మీదనే కేవీపీ కూడా మాట్లాడారు. ఏపీ ప్రజలు 2029 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ ని గెలిపిస్తారు అని కేవీపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమికి ఆల్టరేషన్ గా ఎదగడానికి కాంగ్రెస్ చూస్తోంది.

వైసీపీని ముందుగా బాగా తగ్గిస్తేనే అది సాధ్యపడుతుందని కూడా ఆలోచిస్తోంది. ఈ కారణాలతొనే ఎన్నడూ లేని విధంగా ఏపీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను ఘనంగా కాంగ్రెస్ నిర్వహిస్తోంది. కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తోంది.

మరి కేవీపీ వ్యాఖ్యలు చూస్తూంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్ ఉందని అంటున్నారు. అదే విధంగా ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లుతుందని జోస్యం చెబుతున్నారు. కాంగ్రెస్ ఈ విధంగా జనంలోకి వెళ్తూ జోరు పెంచితే టీడీపీ కూటమి సంగతేమో కానీ వైసీపీకే ఇబ్బంది అని అంటున్నారు. అదే టైంలో కేవీపీకి టచ్ లోకి వస్తున్న మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది. అదే నిజమై పెద్ద తలకాయలు కాంగ్రెస్ వైపు చూస్తే కనుక వైసీపీకి అన్ని విధాలుగా గండం పొంచి ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. మరి దీనిని వైసీపీ ఏ విధంగా తట్టుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది.