Begin typing your search above and press return to search.

తెర వెనక కేవీపీ చాణక్యం...!?

కాంగ్రెస్ ఏపీలో మళ్లీ వేళ్ళూనుకోవాలని చూస్తోంది. రాజకీయాలలో ఒక మాట ఉంది. పోయిన చోట వెతుక్కోవాలని. ఓటమి నిరాశను కలిగిస్తే ఈ మాట మళ్ళీ ఉత్సాహం తెస్తుంది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:12 AM GMT
తెర వెనక కేవీపీ చాణక్యం...!?
X

కాంగ్రెస్ ఏపీలో మళ్లీ వేళ్ళూనుకోవాలని చూస్తోంది. రాజకీయాలలో ఒక మాట ఉంది. పోయిన చోట వెతుక్కోవాలని. ఓటమి నిరాశను కలిగిస్తే ఈ మాట మళ్ళీ ఉత్సాహం తెస్తుంది. కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో ఏపీలో ఠికాణా లేకుండా పోయింది. కాంగ్రెస్ పని అయిపోయింది అని అన్న వారూ ఉన్నారు. అయితే అదే కాంగ్రెస్ కి వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల రూపంలో ఒక అస్త్రం దొరికింది. దాంతో కాంగ్రెస్ తమ జాతకాన్ని మార్చుకునే పనిలో పడింది.

పోరాడితే పోయేది ఏమీ లేదు అన్నది కామ్రేడ్స్ సామెత. అలాంటిది ఏపీలో కాంగ్రెస్ నిలువుగా మునిగింది. షర్మిలతో ట్రై చేస్తే అంతకంటే పోయేది లేదు. పైగా వచ్చే లాభం కూడా ఉండొచ్చు. సరిగ్గా ఈ లెక్కలతోనే కాంగ్రెస్ బరిలోకి దిగింది. కాంగ్రెస్ కి ఎంతో కొంత చెప్పుకోదగిన నాయకులు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, జేడీ శీలం, పల్ల రాజు వంటి వారు ఉన్నారు.

అలాగే రాష్ట్ర మంత్రులుగా చేసిన రఘువీరారెడ్డి, సాకే శైలజానాధ్ వంటి వారూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జనంలో లేకపోయినా భావజాలం అయితే ఉంది. ప్రతీ ఊరిలో కాంగ్రెస్ గుర్తు తెలియని వారు ఎవరూ లేరు. కాంగ్రెస్ కి కావాల్సింది ఎపుడూ లీడ్ చేసే వారు. ఇమేజ్ ఉన్న వారు పార్టీని లీడ్ చేస్తే మిగిలినవి చేసుకోవడానికి చాలా మంది తయారుగా ఉంటారు.

ఇపుడు షర్మిల వైఎస్సార్ తనయగా కాంగ్రెస్ పగ్గాలు అందుకుంది. ఆమె స్పీచ్ లని వినేందుకు ఎటూ జనాలు వస్తారు. ఇక కాంగ్రెస్ లో ఏ మాత్రమైనా స్పందన వచ్చినా దాన్ని సొమ్ము చేసుకునేందుకు ఆ పార్టీ వ్యూహకర్తలు కూడా ఉన్నారు. ఇపుడు ఆ పనిని తెర వెనక చక్కబెట్టేందుకు కేవీపీ రామచంద్రరావు బిజీగా ఉన్నారని అంటున్నారు.

ఆయన హైదరాబాద్ నుంచి షర్మిలతో పాటే ఏపీకి వచ్చారు. ఆమె ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. నా మేనకోడలు అని మీడియా ముందు చెప్పి కాంగ్రెస్ కోసం ఆమెకు అండగా ఉంటాను అని ఒక హామీ ఇచ్చేశారు. ఆ తరువాత కేవీపీ తెర ముందు కనిపించడంలేదు. మరి కేవీపీ ఏమి చేస్తున్నట్లు అన్న ప్రశ్నలు ఉన్నాయి.

ఇక్కడే కేవీపీ మార్క్ చాణక్యం చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు అని అంటున్నారు. ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎవరికి టికెట్లు రావో వారిని అలాగే పార్టీలో అసంతృప్తి నేతలను కలుపుకుంటూ ఒక జాబితా కాంగ్రెస్ దగ్గర ఉందని అంటున్నారు. ఆయా నేతల జాబితాను కేవీపీ తన వద్ద ఉంచుకుని మరీ వారితో మాటామంతీ కలిపి కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేస్తున్నారు అని అంటున్నారు

వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలు ఈ నెల 23 నుంచి మొదలవుతున్నాయి. అది శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అవుతోంది. అలా చూసుకుంటే అక్కడ నుంచే కేవీపీ రాజకీయ చాణక్యం మొదలవుతోంది అని అంటున్నారు. అలా వరసబెట్టి షర్మిల టూర్లు చేసే జిల్లాలలో వైసీపీలో అసంతృప్తులను గేలమేసి మరీ కాంగ్రెస్ లో చేర్పించి వారికి కాంగ్రెస్ కండువా కప్పించే కార్యక్రమంలో బిజీగా ఉంటూ కేవీపీ ఫుల్ ఫోకస్ పెట్టేశారు అని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ లో చేరే వైసీపీ ప్రముఖులు ఎవరో.