Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తుమ్మల...!

ఇక కేసీయార్ 1985లో గెలిచినా ఆయన మంత్రి అయింది మాత్రం 1996లో అంటే పుష్కర కాలం తరువాత అని గుర్తు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 9:22 AM GMT
కేసీఆర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తుమ్మల...!
X

కేసీయార్ అన్నది 2001 తరువాత మారిన పేరో మార్చుకున్న పేరో తెలియదు కానీ సంఖ్యా శాస్త్రం పరంగా చూస్తే పూర్తి స్థాయిలో అచ్చొచ్చింది. నిజంగా చూస్తే అసలు పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ పేరు బలంతో మంత్రి ఉప సభాపతిగానే రాజయోగం పట్టింది. అదే కేసీయార్ గా మూడక్షరాల పవర్ ఫుల్ నేం తో ఏకంగా దేశాన్నే ఆకర్షించారు రాదు అనుకున్న తెలంగాణాను సాధించిన వీరుడిగా చరిత్ర పుటలలో నిలిచారు. కేంద్ర మంత్రి అయ్యారు. అనేక సార్లు ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలిచారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. టీయారెస్ ని బీయారెస్ గా మార్చి జాతీయ రాజకీయాల వైపుగా చూస్తున్నారు.

ఇదంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీయార్ గా మారిన తరువాత జరిగిన అద్భుతం. మరి కె చంద్రశేఖరరవు ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఆయన అంతకు ముందు ఎలా రాజకీయం నడిపేవారు అన్న దాని మీద ఎవరికి తోచిన సమాచారం వారి వద్ద ఉంది. అయితే కె చంద్రశేఖరరావు రాజకీయ అరంగేట్రం చేసింది మాత్రం కాంగ్రెస్ నుంచే. కానీ ఆయనకు రాజకీయ సిరి దక్కింది తెలుగుదేశం నుంచి ఆయనకు 1983లో ఎన్టీయార్ టికెట్ ఇచ్చారు. కానీ సిద్దిపేటలో తొలిసారి పోటీ చేసి ఓడారు.

అయితే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కేసీయార్ గెలిచి నిలిచారు. అది లగాయితూ ఆయన అపజయం లేకుండా సిద్ధిపేట నుంచి గెలుస్తూనే ఉన్నారు. 1989, 1994, 1999లలో గెలిచారు. 1996లో ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు ఇచ్చినది రవాణా శాఖ. మంత్రివర్గంలోకి శాఖలలో అది పెద్దగా ప్రాముఖ్యత లేనిదే అని చెప్పాలి.

ఇక చంద్రబాబు సీఎం అయినపుడు తొలుత రవాణా శాఖను నందమూరి హరిక్రిష్ణకు ఇచ్చారు. ఆయన ఆరు నెలల వ్యవధిలోగా ఎమ్మెల్యే కాలేకపోయారు. దాంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ శాఖను కేసీయార్ కి బాబు ఇచ్చారు. అది 1996 నాటి ముచ్చట. మరి అప్పట్లో చంద్రబాబు రాజకీయంగా బలవంతుడు. ఆయన చుట్టూ టాప్ ఫైవ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉండేవారు. ఇక ఆ తరువాత మరో టాప్ ఫైవ్ మినిస్టర్స్ ఉండేవారు.

ఇలా టాప్ టెన్ ర్యాంక్ హోల్డర్స్ అంతా బాబుతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు కీలక శాఖలలో ఉండేవారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గురించి ఇపుడు చెప్పుకోవాలి. ఆయన 2014 లో బీయారెస్ లో చేరి నేటి దాకా ఆ పార్టీలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన కాంగ్రెస్ లో చేరారు. దాంతో కేసీయార్ తుమ్మల మధ్యన మాటల వార్ సాగుతోంది. లేటెస్ట్ గా ఖమ్మం టూర్ కి వచ్చిన కేసీయార్ తుమ్మలను తాను చేరదీసి మంత్రిని చేశాను అని చెప్పారు. తనను తుమ్మల మోసం చేశారని కూడా ఆరోపించారు.

దానికి తుమ్మల అంతే ధాటీగా రిప్లై ఇచ్చారు. తన వల్ల ఖమ్మంలో బీయారెస్ పటిష్టం అయింది అన్నారు. తాను వచ్చాక సాగు నీటి ప్రాజెక్టులు కూడా పూర్తి అయ్యాయని అన్నారు. తన అవసరం ఉంటేనే ఇంటికి వచ్చి మరీ పార్టీలో చేరమని కోరారని బీయారెస్ పెద్దల మీద విమర్శలు చేసారు. అన్నిటికీ మించి తానే కేసీయార్ కి 1996 ప్రాంతంలో మంత్రి పదవి చంద్రబాబు క్యాబినెట్ లో ఇప్పించాను అని ఒక పెద్ద మాటే అన్నారు.

దీంతో కేసీయార్ ఫ్లాష్ బ్యాక్ ని తుమ్మల కెలికినట్లు అయింది. దాంతో టీడీపీలో కేసీయార్ ప్రస్థానం తుమ్మల ప్రస్థానం మీద కూడా చర్చ సాగుతోంది. తుమ్మల గురించి తీసుకుంటే ఆయన 1985, 1994, 1999లలో మూడు సార్లు సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన చాలా ఏళ్లకు ముందే అంటే తొలినాళ్ళలోనే మంత్రి అయ్యారు. అది కూడా ఎన్టీయార్ మానాలో. అలా కనుక చూసుకుంటే సీనియర్ గా రాజకీయంగా ఉన్నది తుమ్మల అనే అంటున్నారు అనుచరులు.

ఆయన ఎన్టీయార్ క్యాబినెట్ లో మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేశారు. అదే విధంగా చంద్రబాబు క్యాబినెట్ లో కూడా మేజర్ ఇరిగేషన్ మంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా, రోడ్లు భవనాల శాఖల మంత్రిగా కీలకమైన శాఖలనే చూసారు. ఒక విధంగా చెప్పాలీ అంటే మంత్రిగా తుమ్మల కేసీయార్ కంటే సీనియర్ అని ఆయన అనుచరులు అంటున్నారు. అంతే కాదు దశాబ్దాల పాటు మంత్రిగా ఉంటూ అనేక కీలకమైన శాఖలను తుమ్మల చూశారని చెబుతున్నారు.

ఇక కేసీయార్ 1985లో గెలిచినా ఆయన మంత్రి అయింది మాత్రం 1996లో అంటే పుష్కర కాలం తరువాత అని గుర్తు చేస్తున్నారు. తన మిత్రుడిగా ఉన్న కేసీయార్ ని తుమ్మల చంద్రబాబుతో చెప్పి గట్టిగా సిఫార్స్ చేసి

మంత్రిని చేశారని వారు అంటున్నారు. తమ నేత తుమ్మల చెప్పినది నిజం అంటున్నారు.

అయితే దీన్ని బీయారెస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తిప్పికొడుతున్నారు. తుమ్మలకు లైఫ్ ఇచ్చింది కేసీయార్ మాత్రమే అని లేకపోతే ఆయన 2014లోనే పొలిటికల్ గా రిటైర్ అయి ఉండేవారు అని అంటున్నారు. ఏది ఏమైనా కేసీయార్ ఫ్లాష్ బ్యాక్ గురించి తుమ్మల కెలికి మరీ తన వల్లనే ఆయనకు లైఫ్ వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం ఇది ఖమ్మం రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్ గా ఉంది మరి.