మహిళలకు కేసీయార్ మొండిచేయి!
ఇక కేసీయార్ ప్రకటించిన తాజా లిస్ట్ లో ముగ్గురే మహిళా అభ్యర్ధులు ఉన్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 21 Aug 2023 10:48 AM GMTకేసీయార్ వచ్చే ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో పట్టుమని పది మంది మహిళా అభ్యర్ధులు లేకపోవడం చర్చకు తావిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలు ఉన్నాయి. కనీసం జిల్లాకు ఒక్కరి వంతున మహిళలకు సీటు ఇచ్చినా పది మంది అయ్యేవారు అని అంటున్నారు. కానీ కేసీయార్ ఎందుకో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని లిస్ట్ ని ప్రిపేర్ చేశామని బీయారెస్ నిర్వాహకులు చెప్పుకున్నారు కానీ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళల విషయంలో ఎందుకు రిజర్వేషన్లు పాటించలేకపోయారు అన్నది ఇపుడు ప్రశ్నగా ముందుకు వస్తోంది. అంతే కాదు ఇది విపక్షాలకు ఆయుధంగా మారనుందా అన్న చర్చ కూడా ఉంది.
ఇక కేసీయార్ ప్రకటించిన తాజా లిస్ట్ లో ముగ్గురే మహిళా అభ్యర్ధులు ఉన్నారని అంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న స్థానంలో ఆయన కుమార్తె లాస్యా నందితకు టికెట్ ఇచ్చారు. అలాగే ఆసిఫాబాద్ స్థానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మికి టికెట్ ఇచ్చారు. అదే విధంగా ములుగు స్థానాన్ని జెడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతికి కేటాయించారు.
మరి ఎందుకు ఇలా జరిగింది అన్న టాపిక్ అయితే బీయారెస్ లో ఉంది. సమర్ధులు అంగబలం అర్ధబలం కలిగిన వారిని బరిలోకి దించుతున్నామని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహిళలలో గెలుపు గుర్రాలు లేరా లేక ఏ రకమైన సమీకరణలు వారిని ఎంపిక చేసేందుకు అడ్డంకిగా మారాయి అన్నది ఇపుడు బీయారెస్ లో చర్చకు వస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో కేసీయార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినపుడు చాలా కాలం పాటు మహిళా మంత్రిని లేకుండానే నడిపించారని గుర్తు చేస్తున్నారు. మహిళా ఓట్లు ప్రతీ రాజకీయ పార్టీకి ప్రధానం. బీయారెస్ లో కూడా మహిళా నేతలు అనేక మంది ఉన్నారు. తెలంగాణాలో మొత్తం 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. పది శాతం వారికి ఇవ్వాలనుకున్నా పన్నెండు మందికి చాన్స్ దక్కుతుంది.
కానీ ప్రస్తుతం జాబితా చూస్తే కనాకష్టంగా మహిళలు ముగ్గురే కనిపిస్తున్నారు అని అంటున్నారు. దీంతో టికెట్లు ఆశిస్తున్న మహిళా అభ్యర్ధులలో తీవ్ర నిరాశతో పాటు అసంతృప్తి కూడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది అని అంటున్నారు. దీనిని బీయారెస్ ఎలా కవర్ చేసుకుంటుందో చూడాలని అంటున్నారు.