Begin typing your search above and press return to search.

నెయ్యి కారుతున్న వైసీపీ!

వైసీపీకి మొదటి నుంచి ఉన్న లోపం ఏంటి అంటే స్వీయ రక్షణ మెకానిజం లేకపోవడం. పైగా జనాలు ఏదీ పట్టించుకోరు అన్న ఉదాశీనత.

By:  Tupaki Desk   |   21 Sep 2024 3:50 AM GMT
నెయ్యి కారుతున్న వైసీపీ!
X

వైసీపీకి మొదటి నుంచి ఉన్న లోపం ఏంటి అంటే స్వీయ రక్షణ మెకానిజం లేకపోవడం. పైగా జనాలు ఏదీ పట్టించుకోరు అన్న ఉదాశీనత. వీటి వల్లనే గాలి పోగు చేసినా అది వైసీపీ విషయంలో నిజం అయి కూర్చుంది. వైసీపీ నుంచి సరైన వివరణ ఎపుడూ ఉండదు, స్ట్రాంగ్ గా కాచుకునే నైపుణ్యం అంతకంటే ఉండదు.

ఇదిలా ఉంటే వైసీపీని సరైన గురి చూసి మటాష్ చేసే అతి పెద్ద కార్యక్రమానికి టీడీపీ తెర తీసింది. కల్తీ నెయ్యి అంటూ మొదలెట్టి చివరికి అది జంతువుల నుంచి తీసిన ఆయిల్ అని డిసైడ్ చేసి వైసీపీ మీదకు బలంగా వదిలింది. దీనికి సంబంధించి కల్తీ నెయ్యి వాడుతున్నారు అని ఒక ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలు స్పష్టం చేయడంతో టీడీపీ కరెక్ట్ టైం చూసి బాణం వేసింది.

చంద్రబాబు యధాలాపంగా ఏమీ ఈ మాట చెప్పలేదు. ఆయన చాలా ఎమోషనల్ టచ్ ఇచ్చి ఎన్డీయే సమావేశంలో మాట్లాడారు. దాంతో వెంటనే వైవీ సుబ్బారెడ్డి రియాక్ట్ అయి ట్వీట్ చేసినా అది అప్పటికే చేయి దాటిపోయింది. ఇక రెండో రోజు మాజీ టీటీడీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి భూమన కరుణాకరరెడ్డి ఇద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి వివరణలు ఇచ్చినా జనంలోకి ఈ విషయం బలంగా వెళ్లిపోయింది.

ఇక మూడవ రోజున జగన్ ఈ విషయం మీద వివరణ ఇవ్వడం కంటే చంద్రబాబు రాజకీయాన్ని విమర్శించడం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. బాబు దేవుడిని సైతం వదలరు అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ వైసీపీ కార్నర్ అయింది ఒక్క పాయింట్ మీద నెయ్యి కేవలం 320 రూపాయలకు కిలో వంతున టెండర్లు పిలిచి కొనడం అన్నది టీడీపీ హైలెట్ చేస్తోంది. మార్కెట్ లో అయిదు వందలకు పైగా ఆవు నేయి ఉంటే కారు చౌకగా కల్తీ నెయ్యి కొని దేవుడికి నైవేద్యం పెట్టారు అని చంద్రబాబే ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆరోపించారు.

కల్తీతో చేసిన నేయి జంతువుల కొవ్వుతో తెచ్చిన ఆయిల్ ని నేతిలో కలిపి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేశారు అని ఆయన మండిపడ్డారు. ఇపుడు తాపీగా నాకు ఏమీ తెలియదు అని జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నారు అని ఆయన అన్నారు. ఇలాంటి అపచారం చేసిన వారిని వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

మొత్తానికి చూస్తే శ్రీవారి లడ్డూ ప్రజల బలమైన సెంటిమెంట్. అది ఇపుడు దావానలంగా జనంలోకి వెళ్ళిపోయింది. దానికి తోడు అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ సీరియస్ గా ఈ ఇష్యూ మీద రియాక్ట్ అవుతోంది. మరో వైపు కర్నాటక ప్రభుత్వం కూడా తిరుమల శ్రీవారికి తమిళనాడులోని ఒక సంస్థ నుంచి సరఫరా చేసిన నేయి అపవిత్రం అని ల్యాబ్ నివేదికలు నిర్ధారించిన క్రమంలో ఆ సంస్థ నుంచి నేయిని కొనుగోలు చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం నందిని నేయిని కొనుగోలు చేయాలని తమ దేవాదాయ శాఖకు సూచించడం అదే విధంగా తమిళనాడు సర్కార్ కూడా సదరు సంస్థ నుంచి తాము నేయి కొనుగోలు చేయడం లేదని చెప్పడంతో వైసీపీ మరింతంగా కార్నర్ అవుతోంది.

మొత్తం మీద చూస్తే ఒకే ఒక్క విమర్శ అది బలమైన సెంటిమెంట్ తో వైసీపీ విలవిలలాడుతోంది. తగిలిన రాజకీయ బాణంతో సతమతమవుతోంది. ఇపుడు వైసీపీలో పరిస్థితి చూస్తే నేయి కారుతోందని అంటున్నారు. కౌంటర్లు ఇచ్చే సీనియర్లు కానీ తమ వాదన లాజికల్ గా వినిపించే వారు కానీ లేకపోవడంతో వైసీపీ గొంతు కడు బలహీనం అవుతోంది. టీడీపీ దెబ్బకు వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది అని అంటున్నారు. దీని నుంచి ఎలా బయటపడడం అన్న దాని మీద కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు.