మంత్రి కేటీఆర్ బందోబస్తుకు వెళ్లిన మహిళా పోలీస్ మృత్యువాత!
చిన్న చిన్న సంఘటనలు ఒక్కోసారి పెద్దవిగా మారి.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా మారుతుంటాయి.
By: Tupaki Desk | 1 Oct 2023 7:04 AM GMTచిన్న చిన్న సంఘటనలు ఒక్కోసారి పెద్దవిగా మారి.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా మారుతుంటాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఒక విషాదం.. కేసీఆర్ ప్రభుత్వ తీరును వేలెత్తేలా చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రోజుల వ్యవధిలోకి వచ్చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్న వేళ.. మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఎన్నికల వేడికి పెంచేలా ఉన్న కేటీఆర్ పర్యటనల వేళ.. తాజాగా చోటు చేసుకున్న ఒక విషాద ఉదంతం ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి బందోబస్తు కోసం కొత్తగూడెంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న రూపన శ్రీదేవి (45)భద్రాచలం వెళ్లారు. ఆమెకు ఆలయ అన్నదాన సత్రం వద్ద విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భారీ వర్షం కురవటంతో ఆ ప్రాంతం మొత్తం వరద చుట్టుముట్టింది. వర్షం వేళ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పర్యటన క్యాన్సిల్ అయ్యింది.
దీంతో.. అప్పటివరకు బయట విధులు నిర్వర్తిస్తున్న శ్రీదేవి సత్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె మధ్యలో ఉన్న మురుగు కాలువలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. భారీవర్షం కారణంగా మురుగుకాలువను వరద కప్పేయటంతో.. ఆమె జారీ పడ్డారు. ఆమెను బయటకు లాగేందుకు అక్కడే ఉన్న పంచాయితీ కార్మికుడు సునీల్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వర్షపు నీరు ఉద్ధ్రతంగా ఉండటంతో ఆమె కాలువ ప్రవాహంలో కొట్టుకుపోయారు.
తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేస్తుందని సెల్ఫ్ సర్టిఫికేట్లు ఇచ్చుకునే మంత్రి కేటీఆర్.. ఇలాంటి విషాద ఉదంతాలకు ఏమని సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వర్షం పడితే చాలు హైదరాబాద్ మహానగరంతో సహా రాష్ట్రంలోని పలు నగరాలు.. పట్టణాలు ఆగమాగం అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు.. తాజా ఉదంతం మరింత బలం చేకూరేలా మారిందన్న మాట వినిపిస్తోంది. మురుగు కాలువలో కొట్టుకుపోయిన శ్రీదేవి డెడ్ బాడీని గోదావరి కరకట్ట స్లూయిస్ పైపుల వద్ద గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ సాయంతో బయటకు తీశారు. శ్రీదేవి భర్త రామారావు కేంద్రంలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. వీరికి ఒక కొడుకు.. కుమార్తె ఉన్నారు. మంత్రి బందోబస్తుకు వెళ్లిన శ్రీదేవి మరణించిన వైనం షాకింగ్ గా మారింది. ఈ విషాద ఘటన వేళ.. ప్రభుత్వ పని తీరుపై చర్చ సీరియస్ గా సాగటం గమనార్హం.