లగడపాటి మళ్లీ వచ్చాడు !
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆయన తన ఓటుహక్కును విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వినియోగించుకున్నాడు.
By: Tupaki Desk | 13 May 2024 12:25 PM GMTతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సవాల్ ప్రకారం రాజకీయాలకు దూరం అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆయన తన ఓటుహక్కును విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వినియోగించుకున్నాడు.
‘‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ఓటింగ్ బాగా జరుగుతుంది. మధ్యాహ్నం పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు తక్కువగా ఉంటారని ఓటు వేయడానికి వచ్చాను. కానీ, ఓటర్లు బారులుతీరి ఉన్నారు‘‘ అని లగడపాటి అన్నారు. అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ నేపథ్యంలో సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయిందని, బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు ఏది దొరికితే దానిని పట్టుకుని ఏపీకి ఓట్లేసేందుకు వస్తున్నారని లగడపాటి అన్నారు.
ప్రతి ఎన్నికలలో ఏ పార్టీలు గెలుస్తాయి అని సర్వేలు వెల్లడించే లగడపాటి ఈ సారి మాత్రం ’’ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని నేను చెప్పలేను. విజేత ఎవరనే విషయం జూన్ 4వ తేదీన తెలుస్తుంది‘‘ అని చెప్పడం విశేషం. 2018 తెలంగాణ ఫలితాలపై, 2019 ఏపీ ఫలితాలపై ఆయన అంచనాలు తారుమారు కావడంతో అప్పటి నుండి సర్వేలకు దూరంగా ఉంటున్నాడు.