కేంద్రం కూడా 'అప్పుల కుప్పే' ఈ ఏడాది మార్చి నాటికి ఎన్ని లక్షల కోట్లంటే
ఈ అప్పుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా
By: Tupaki Desk | 8 Aug 2023 7:37 AM GMT'అప్పులు చేస్తున్న రాష్ట్రాలకు నేనొకటే చెప్పదలుచుకున్నా. మీ పరిస్థితి చూస్తుంటే.. శ్రీలంక, పాకిస్థాన్ మాదిరిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కట్టడి చేసుకోండి. ఉచితాలు మానేయండి. అప్పులు నియంత్రించండి''- ఈ ఏడాది వార్షిక బడ్జెట్(2023-24) ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన హెచ్చరిక. అప్పట్లో ఏపీ సహా.. బీజేపీయేతర రాష్ట్రాలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారంలోకి వచ్చింది.
కట్ చేస్తే.. ఈ అప్పుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా.. అప్పులు విషయంలో తక్కువేమీ కాదనే అంశం.. తాజాగా నిండు పార్లమెంటులో కేంద్రం చెప్పిన లెక్కలను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 31(నెలాఖరు) నాటికి కేంద్రం అప్పులు.. 156 లక్షల కోట్ల రూపాయలకుపైగానే ఉన్నాయి. ఇది.. దేశ జీడీపీ(తలసరి ఆదాయం)లో 57.1 శాతానికి చేరాయి. ఇక, మోడీ సర్కారు పగ్గాలు చేపట్టే నాటికి.. అంటే 2014 మార్చి 31లో ఈ అప్పులు జీడీపీలో 52.4 శాతం ఉన్నాయి. అంటే.. అప్పటికి ఉన్న మొత్తం అప్పు 58 లక్షల కోట్ల రూపాయలు.
మోడీ ఒక్కరే 98 లక్షల కోట్ల అప్పు
మోడీ హయాంలో అప్పులు ర్యాకెట్ వేగాన్ని మించిన వేగంతో పుంజుకున్నాయనేది పార్లమెంటుకు తాజాగా వెల్లడించిన ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. 2014లో 58.6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే.. 2014-2023(9 ఏళ్లు) నాటికి ఈ అప్పులు 156 లక్షల కోట్లకు చేరాయి. అంటే.. ఈ 9 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం దాదాపు 98 లక్షల కోట్ల మేరకు అప్పులు చేసిందన్న మాట. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంటుకు వివరించారు.
ఇదీ.. అప్పుల లెక్క..
+ 2014 నుంచి 2023 మధ్యకాలంలో మొత్తం రుణాలు రూ.58.6 లక్షల కోట్ల నుంచి రూ.155.6 లక్షల కోట్లకు చేరాయి.
+ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.105.1 లక్షల కోట్లు. జీడీపీలో ఇది 52.4%
+ 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పు రూ.121.9 లక్షల కోట్లు. జీడీపీలో 61.5%
+ విదేశీ అప్పు.. 2014 మార్చి 31 నుంచి 2023 మార్చి 31 మధ్యకాలంలో రూ.3,74,484 కోట్ల నుంచి రూ.7,48,895 కోట్లకు చేరింది.