మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణహాని?... ఫిర్యాదు ఎవరిపై అంటే...?
ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ ను కలిసిన ఆయన.. తన ఫిర్యాదును అందజేశారు.
By: Tupaki Desk | 26 April 2024 12:43 PM GMTవిశాఖపట్నంలో ఒక అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. తనకు ప్రాణహాని ఉందని, తన గురించి రెక్కీ నిర్వహిస్తున్నారంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ ను కలిసిన ఆయన.. తన ఫిర్యాదును అందజేశారు. దీంతో... ఒక్కసారిగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!
అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తనకు ప్రాణహాని ఉందంటూ సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ.. విశాఖ పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్న జేడీ.. ఉన్నపలంగా ఇలా ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. దీంతో గతంలో ఆయన సీబీఐ జేడీగా ఉన్నప్పుడు డీల్ చేసిన కేసులకు సంబంధించిన వ్యక్తుల నుంచే ఆయంకు ప్రాణహాని ఉండి ఉండొచ్చనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... ఈ విషయంపైనా మాజీ జేడీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా... జెడీ లక్ష్మి నారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో... పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేసిన సంగతి తెలిసిందే. సత్యం రామలింగరాజు కేసు, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు, ఏపీ ముఖ్యమంత్రిపై సీబీఐ, ఈడీ కేసుల వరకు అనేక కేసులను డీల్ చేశారు. దీంతో లక్ష్మి నారాయణ.. తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పేరు సంపాదించుకున్నారు.
అనంతరం యూపీ కేడర్ ఐపీఎస్ కు రాజీనామా చేసిన ఆయన... 2019లో రాజకీయ ప్రవేశం చేసి జనసేన నుంచి విశాఖ లోక్ సభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సుమారు 2.88 లక్షల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం జనసేనకు రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ... ఇటీవల “జై భారత్ పార్టీ” అధ్యక్షుడి హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో అనూహ్యంగా అన్నట్లుగా... విశాఖ సీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ ని కలిసి.. ఇలా తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో జేడీ లక్ష్మీ నారాయణ కొన్ని ఆధారాలను సమర్పించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. గతంలో తాను డీల్ చేసిన కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ థ్రెట్ ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.
ఈ మెరకు... గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు విశాఖలో ఉన్నారని.. వాళ్ళు తన కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారని.. తనను హత్య చేయడానికి సిద్ధం అయ్యారని.. ఆ మేరకు రెక్కి కూడా నిర్వహించారని తనకు అనుమానం ఉందని.. ఆయన తన ఫిర్యాదు లో పేర్కొన్నారని సమాచారం! దీంతో... నెక్స్ట్ ఏమి జరగబోతోంది.. పోలీసు విచారణ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి మొదలైంది!