అయ్య బాబోయ్ .. ప్రొఫెసర్ @ లక్ష్మీపార్వతి !
గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్శిటీలో ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్ ను ఏర్పాటు చేశారు.
By: Tupaki Desk | 12 July 2024 9:18 AM GMTలక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు కదా ? మరి ప్రొఫెసర్ ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు విన్నది నిజమే. వైసీపీ పాలనలో ఆమె గత మూడేళ్లుగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆమె తెలుగు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ ఉద్యోగం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెలుగులోకి వచ్చింది.
గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్శిటీలో ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్ ను ఏర్పాటు చేశారు. దీనికి అసలు విశ్వవిద్యాలయానికే ఏ మాత్రం సంబంధం లేని జేమ్స్ స్టీఫెన్ అనే వ్యక్తిని తీసుకువచ్చి డీన్ గా నియమించారు. ఇందులో పీహెడ్డీ పరిశోధకులకు మార్గదర్శకురాలిగా (గైడ్) లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ వ్యవహారం మూడేళ్ల కిందటే జరిగిపోయింది.
వాస్తవంగా లక్ష్మీపార్వతి విజయవాడలో నివాసం ఉంటారు. పీహెడ్డీ చేసే వారంతా విశాఖపట్నంలో ఉంటారు. మరి విజయవాడలో ఉండే లక్ష్మీపార్వతి విశాఖలో ఉండే వారికి ఎలా గైడెన్స్ చేస్తారు ? చేశారు ? అన్నది అంతుచిక్కని ప్రశ్న. ఈ గైడ్ గా వ్యవహరించే వారికి కనీసం పీజీ విద్యార్థులకు ఐదేళ్లు పాఠాలు బోధించిన అనుభవం ఉండాలి. కానీ వైసీపీ నేత అన్న ఏకైక అర్హతతో లక్ష్మీపార్వతిని నియమించారు.
లక్ష్మీపార్వతి ఎప్పుడు విశాఖపట్నానికి వస్తారు ? ఆమెతో మేము ఎప్పుడు సలహాలు తీసుకోవాలి ? అని పరిశోధన విద్యార్థులు అడిగిన ప్రశ్నకు అవన్నీ నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను అని డీన్ కమ్ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ భరోసా ఇస్తున్నారట. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో వేచిచూడాలి.