Begin typing your search above and press return to search.

11 రోజుల్లో ఐపీఎల్.. ఫౌండర్ లలిత్ మోదీ ఎక్కడ? వనవాటు పౌరుడేనా?

కానీ, వనవాటు కూడా లలిత్ మోదీని పొమ్మంటోంది.. ఐపీఎల్‌ వ్యవస్థాపకుడైన లలిత్‌ మోదీకి వనవాటు ప్రధాని జోథం నపౌట్ షాక్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   11 March 2025 2:00 PM IST
11 రోజుల్లో ఐపీఎల్.. ఫౌండర్ లలిత్ మోదీ ఎక్కడ? వనవాటు పౌరుడేనా?
X

సరిగ్గా 11 రోజుల్లో మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను అలరించనుంది.. కానీ, అసలు ఐపీఎల్ అనే ఆలోచనకు పునాది వేసిన వ్యాపారవేత్త ఎవరో తెలుసా? బహుశా లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఇంత విజయవంతం అవుతుందని అతడు కూడా కలగని ఉండడు. కానీ, ప్రపంచంలో అతడి జీవనం ఎక్కడ..? అంటే మాత్రం చెప్పలేం.. కారణం.. ఒకప్పుడు భారత్, తర్వాత బ్రిటన్, ఇప్పుడు వనవాటు.

కానీ, వనవాటు కూడా లలిత్ మోదీని పొమ్మంటోంది.. ఐపీఎల్‌ వ్యవస్థాపకుడైన లలిత్‌ మోదీకి వనవాటు ప్రధాని జోథం నపౌట్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ అయిన లలిత్ మోదీకి జారీ చేసిన వనవాటు పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. కానీ, అసలే సరదా మనిషి అయిన లలిత్ మోదీ ఈ నేపథ్యంలో కీలక ట్వీట్‌ చేశాడు..

ఇదొక అందమైన దేశం.. ఒక స్వర్గం. మీ టూరిజం జాబితాలో చేర్చుకోండి అంటూ ట్వీట్ చేస్తూ.. వనవాటులో దిగిన ఫొటోలనూ పెట్టారు. ఇదంతా వనవాటు ప్రధాని నిర్ణయం తర్వాత కొన్ని గంటలకే జరగడం గమనార్హం.

లలిత్ మోదీ పక్కా వ్యాపార కుటుంబంలో పుట్టారు. వారిది సంపన్న నేపథ్యం. అలానే ఎదిగారు లలిత్ మోదీ. ఐపీఎల్ కు పునాది వేసినవారిలో లలిత్ మోదీ ఎంతటి కీలకమో తెలిసిందే. ఫ్రాంచైజీలోనూ ఆయనకు వాటాలుండేవి. అలాంటి లలిత్ మోదీ.. కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

ఐపీఎల్ మొదలైన మూడేళ్లకే అంటే 2010లో లండన్‌ కు పారిపోయాడు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. ఆర్థిక నేరగాడిగా భావిస్తూ స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తుండగా వనవాటు పాస్‌పోర్టు పొందినట్లు తెలిసింది. ఇది చివరకు వివాదం కావడంతో లలిత్ మోదీ వనవాటు పౌరసత్వాన్ని ఆ దేశ ప్రధాని రద్దు చేశారు.

వనవాటు అనేది పన్ను రహిత దేశం. అత్యంత సులువుగా పాస్ పోర్టు దొరికే దేశం. ఇంకా అనేక సౌలభ్యాలు ఉన్న ఈ దేశాన్ని ఉద్దేశూపూర్వకంగానే లలిత్ మోదీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్‌ పోల్ స్క్రీనింగ్‌ లలో నేరారోపణలు లేవని తేలడంతో అతడికి వనవాటు పాస్ పోర్టు వచ్చింది. భారత్ లో దర్యాప్తును తప్పించుకోవడానికే అతడు తమ పౌరసత్వం తీసుకున్నాడని తెలిసి దానిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు వనవాటు ప్రధాని పేర్కొన్నారు.