Begin typing your search above and press return to search.

నితీష్ కి కన్ను గీటిన లాలూ... ఎన్డీయేలో కలవరమేనా ?

కానీ ఆయన రాజకీయ జీవితంలో పార్టీలను మారుస్తూ కొత్త బంధాలను ఎప్పటికపుడు పెనవేసుకుంటూ సాగిన ధోరణులను మాత్రం అంతా వ్యతిరేకిస్తూనే ఉంటారు

By:  Tupaki Desk   |   3 Jan 2025 3:47 AM GMT
నితీష్ కి కన్ను గీటిన లాలూ...  ఎన్డీయేలో కలవరమేనా ?
X

బీహార్ సీఎం నితీష్ కుమార్ నిజాయతీని ఎవరూ శంకించాల్సిన పని అయితే లేదు. కానీ ఆయన రాజకీయ జీవితంలో పార్టీలను మారుస్తూ కొత్త బంధాలను ఎప్పటికపుడు పెనవేసుకుంటూ సాగిన ధోరణులను మాత్రం అంతా వ్యతిరేకిస్తూనే ఉంటారు.

దేశంలో ఇంతలా పార్టీలను మార్చే నేత మరొకరు ఉన్నారా అనిపీంచేలా నితీష్ కుమార్ అటూ ఇటూ మారుతూ తన రాజకీయ నీతి విషయంలో సందేహాలే మిగిల్చారు. ఆయన 2020లో బీహార్ లో ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ అయిదేళ్ల కాలంలోనే ఆయన బీజేపీ నుంచి ఇండియా కూటమికి వెళ్లారు. ఒక విధంగా చూస్తే ఇండియా కూటమి ఏర్పాటు వెనక నితీష్ కుమార్ ఉన్నారని చెప్పాల్సిందే.

ఆయన ఇదంతా చేసింది ఇండియా కూటమికి సారధి కావాలని ఆ మీదట అవకాశం ఉంటే దేశానికి ప్రధాని కావాలని భావించారు. అయితే ఆయనకు ఇండియా కూటమిలో కీలక స్థానం దక్కకుండా చేసింది తోటి బీహారీ నేత ఒకనాటి సహచరుడు ఆర్జేడీ అధినేత అయిన లలూ ప్రసాద్ యాదవ్ నే అని అంటారు.

ఆయన రాహుల్ గాంధీని కాంగ్రెస్ ని వెనకేసుకుని వస్తూ వారికే పెద్ద పీట ఉండాలని కోరుకుంటూ వచ్చారు. దాంతో నితీష్ కి ఇండియా కూటమిలో ఉంటే ఏమి జరుగుతుందో సీన్ మొత్తం అర్ధం అయింది. దాంతో ఆయన చేసేది లేక మళ్లీ గో టూ పెవిలియన్ అన్నట్లుగా ఎన్డీయే కూటమిలోకి వచ్చారు.

అలా నితీష్ గత ఏణ్ణర్ధ కాలంగా ఎన్డీయే కూటమితోనె ఉన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎన్డీయే అత్యధిక స్థానాలు సాధించింది. అంతే కాదు కేంద్రంలో మూడవసారి అధికారం అందుకుంది. నితీష్ నాయకత్వంలోని జేడీయూ కూడా కీలక మంత్రి పదవులు తీసుకుంది. ఎన్డీయేలో మూడవ అతి పెద్ద పార్టీగా జేడీయూకి గుర్తింపు ఉంది

ఇక 2025 అక్టోబర్ లో బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ పేరునే ప్రకటిస్తారు అంటున్నారు. దాంతో ఆయన కూడా ఆ వైపునే ఉండి ఎన్నికల్లో పోరాడాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మాజీ సీఎం లాలూ యాదవ్ నితీష్ కుమార్ కి కన్ను గిటారు. ఇండియా కూటమిలోకి నితీష్ కి ఆహ్వానమని అన్నారు. ఆయన ఎపుడు వచ్చినా తలుపులు తెరచే ఉంటాయని కూడా రెడ్ కార్పెట్ ని పరచారు

రాజకీయంగా చూస్తే ఇవి ఎన్డీయేని కలవరపరచే వ్యాఖ్యలే అంటున్నారు. కేంద్రంలో బొటాబొటీ మెజారిటీతో ఎన్డీయే సర్కార్ ఉంది. నితీష్ కుమార్ మద్దతు చాలా కీలకంగా మారింది. ఆ ఊతకర్రను లాగేయాలని ఇండియా కూటమి చూస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇపుడు నితీష్ ని తమ వైపు తిప్పుకుంటే కేంద్రంలో మోడీ సర్కార్ కి కష్టాలు తప్పవని అంటున్నారు. అందుకే తెలివిగా నితీష్ కి తలుపులు తెరచి ఉంచామని లాలూ చెప్పారని అంటున్నారు

అయితే దానికి బదులుగా నితీష్ కుమార్ ఏమి చెబుతున్నారు లాలూ అంటూ గట్టిగానే మాట్లాడారు. తాను ఎన్డీయే కూటమిలోనే ఉంటాను అని చెప్పారు. కానీ గతంలో రెండు సార్లు ఎన్డీయే కూటమి నుంచి ఫిరాయించి బయటకు వచ్చిన నితీష్ పట్ల అందరిలోనూ సందేహాలు ఉన్నాయి.

మరి నితీష్ కుమార్ ని ముందు పెట్టి ఎన్డీయే కూటమికి భారీ షాక్ ని ఇచ్చేందుకు ఇండియా కూటమి కొత్త ఏడాదిలో సరికొత్త వ్యూహాలకు తెర తీస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి 2025లో అడుగుపెడుతూనే లాలూ బాంబు పేల్చారు. నితీష్ వైపే ఇపుడు ఎన్డీయే పెద్దల చూపులు ఉన్నాయని అంటున్నారు.