మోడీ కంటే ఇందిరాగాంధీయే బెటర్
వాజ్ పేయి మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసినా ఎక్కువ కాలం పాలించలేదు.
By: Tupaki Desk | 30 Jun 2024 3:39 AM GMTనరేంద్ర మోడీకి ఇందిరాగాంధీకి ఒక విషయంలో పోలిక ఉంది. ఇద్దరూ ముమ్మారు ప్రధానులుగా దేశాన్ని పాలించారు. వాజ్ పేయి మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసినా ఎక్కువ కాలం పాలించలేదు. ఆ విధంగా ఇందిరతోనే మోడీని పోలిక పోల్చుకోవాలి.
ఇందిరను ఐరన్ లేడీ అంటారు. మోడీని కూడా నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరని అంటారు. అలా ఇద్దరి విషయంలో మాట్లాడేవారు మాట్లాడుతూంటారు. అయితే బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మోడీకి ఇందిరాగాంధీకి అసలు పోలిక ఎక్కడా లేనేలేదు అని విమర్శించారు.
ఆయన తాజాగా ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టింగ్ రాజకీయ దుమారం రేపుతోంది. ఆనాడు ఎమర్జెన్సీకి ఎదురొడ్డి పోరాడింది మేము అని ఆయన అన్నారు. మమ్మల్ని భద్రతా చట్టం కింద ఇందిరాగాంధీ అరెస్ట్ చేసి పదిహేను నెలల పాటు జైల్లో ఉంచారు అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆనాడు ఇందిరిగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాశ్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి తాను కన్వీనర్‌గా ఉన్నానని లాలూ గుర్తు చేసుకున్నారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో సంఘపరివార్ చాలా సైలెంట్ గా ఉందని నళిన్ వర్మ అనే జర్నలిస్టు రాసిన కథనాన్ని కూడా లాలూ ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ కథనాన్ని కూడా ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ విధంగా ఎమెర్జెన్సీ గురించి తెలియని బీజేపీ మంత్రులు అంతా ఈ రోజు మాట్లాడుతున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. ఎమెర్జెన్సీ అని ఇందిరాగాంధీ పెట్టినా విపక్ష నేతలను గౌరవించారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతే కాదు మమ్మల్ని ఎవరినీ దేశ భక్తులు కాదు అని అనలేదని ఆయన బీజేపీ మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
అలా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని సైతం గౌరవించే ఇందిరాగాంధీ ఒక వైపు ఉంటే ప్రతిపక్షాలను గొంతు నొక్కిన మోడీ ఆయన మంత్రి వర్గ సహచరులను 2024లో చూస్తున్నామని లాలూ అన్నారు. ఎమెర్జెన్సీ గురించి తెలియని వారు ఇపుడు మాట్లాడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.
ఎమెర్జెన్సీ విధింపు ముమ్మాటికీ తప్పే అది ప్రజాస్వామ్యానికి మచ్చే అంత మాత్రం చేత దాని కంటే కూడా ఎక్కువ నిర్బంధాలను పెట్టే వారిని ఏమనాలి అని ఆయన బీజేపీ పాలకులను సూటిగా ప్రశ్నించారు. మొత్తానికి మాట్లాడితే చాలు ఎమెర్జెన్సీ అని ఇందిరమ్మ పాలన మీద విమర్శలు చేస్తున్న మోడీ అండ్ టీం కి లాలూ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు అని అంటున్నారు.