Begin typing your search above and press return to search.

మోడీకి ఆగస్ట్ గండం ?

మోడీ ప్రభుత్వం అస్థిరమైనదిగా ఎందుకు భావించాలి అంటే అందులో రెండు కీలక భాగస్వాముల మద్దతు ఉంది.

By:  Tupaki Desk   |   6 July 2024 3:30 AM GMT
మోడీకి ఆగస్ట్ గండం ?
X

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరీ అంత బలహీనంగా ఉందా అంటే జవాబు ఎవరికి తోచిన తీరున వారు చెప్పుకోవచ్చు. అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు వెనక ఉన్న రాజకీయ పార్టీలు మరో వైపు జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు ఇంకో వైపు బలంగా ఉన్న ఇండియా కూటమి ఇవన్నీ చూస్తూంటే మోడీ ప్రభుత్వం అయిదేళ్ళూ ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది అన్నది నిజం.

మోడీ ప్రభుత్వం అస్థిరమైనదిగా ఎందుకు భావించాలి అంటే అందులో రెండు కీలక భాగస్వాముల మద్దతు ఉంది. ఒకటి తెలుగుదేశం పార్టీ ఉంది. మరోటి జేడీయూ. చంద్రబాబు నితీష్ కుమార్ వాటి అధినేతలు. చంద్రబాబు వరకూ ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా కూల్చుతారు అని ఎవరూ అనుకోరు. ఆయన గతంలో యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి నిలబెట్టాలనే చూసారు. వాజ్ పేయి ప్రభుత్వం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నపుడు కూడా బాబు ఆయనకు అండగా ఉండీ కొనసాగేలా చూశారు.

అలా చూస్తే కనుక బాబుకు ఆ ఉద్దేశ్యాలు లేవు అనుకోవచ్చు. కానీ అందరి అనుమానాలు జేడీయూ మీదనే ఉన్నాయి. నితీష్ కుమార్ అటూ ఇటూ పార్టీలు పొత్తులు మార్చడంలో ఘనాపాటి అని అంటారు. ఇప్పుడు ఆయన ప్రత్యేక హోదా డిమాండ్ ని ఎత్తుకున్నారు. ఇది రాష్ట్రం కోసం అయినా వెనక రాజకీయం కూడా ఉంది అని అంటున్నారు.

ఇపుడు అదే బీహార్ నుంచి సీనియర్ మోస్ట్ నేత మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆగస్ట్ లోగా మోడీ ప్రభుత్వం కూలిపోవచ్చు అని డెడ్ లైన్ పెట్టి మరీ జోస్యం చెప్పేశారు. అంతటితో ఆయన ఆగలేదు, మోడీ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉంది అని కూడా అన్నారు.

ఈ నేపధ్యంలో నుంచి చూస్తే మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ ఎవరైనా చేస్తే జరిగేది అదే. మరి బీహార్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి అందరి చూపూ నితీష్ మీదనే ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించే అనుభవం అయితే మోడీ అండ్ కోకు లేదు అని అంటున్నారు. ఆయన ఎపుడూ సొంత బలంతో ప్రభుత్వాన్ని నడిపారు.

తన నిర్ణయాలను ఆయన యధేచ్చగా తీసుకుంటూ వచ్చారు. ఎవరైనా ఎదిరించే సాహసం చేయలేకపోయేవారు. అలాంటిది మోడీ మిత్రుల మాట వింటారని వారిని కలుపుకుని ముందుకు పోతారని విపక్షాలు అయితే అనుకోవడం లేదు.అందుకే వారి ఆశలు అన్నీ మోడీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని.

ఇక్కడ మరో విశేషం చెప్పుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేయడం. అది కూడా కాంగ్రెస్ పక్షాన మాత్రమే కాదు మొత్తంగా ఇండియా కూటమి పక్షాన చేశారు. అంటే రేపటి రోజున ఎన్డీయే కూటమికి ఇబ్బంది వచ్చి కూలిపోతే ఆ వెంటనే ఎన్నికలు జరగకుండా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చాన్స్ ఇండియా కూటమి తీసుకోవచ్చు అని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికలు జరిగిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వం కూలిపోతే ఇండియా కూటమికి చాన్స్ ఉండొచ్చు. అలా కాకుండా రెండేళ్ళు అయినా ప్రభుత్వం మనగలిగితే బీజేపీయే ఎన్నికలను కోరుకుంటుంది. మొత్తం మీద చూస్తే లాలూ కామెంట్స్ ఇపుడు అతి పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.