క్యాన్సర్ పేరు చెప్పి భారీగా 'క్యాష్' చేసుకొన్నాడు.. నెక్స్ట్ బిగ్ ట్విస్ట్!
ఇదే సమయంలో.. ఈ వ్యాధి బారిన పడిన వారి విషయంలో దాతలు ముందుకు వస్తుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని 'క్యాష్' చేసుకున్నాడో యువకుడు!
By: Tupaki Desk | 21 Nov 2024 12:30 AM GMTక్యాన్సర్ అనేది ఎంత భయంకరమైన వ్యాధి అనేది.. దాని బారిన పడిన వారికి తెలుస్తుందని, దానికి సంబంధించి తీసుకునే ట్రీట్ మెంట్ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది అనుభవించినవారికే తెలుస్తుందని అంటారు. ఇదే సమయంలో.. ఈ వ్యాధి బారిన పడిన వారి విషయంలో దాతలు ముందుకు వస్తుంటారు. సరిగ్గా ఇదే విషయాన్ని 'క్యాష్' చేసుకున్నాడో యువకుడు!
అవును... చైనాలోని హుబే ప్రావిన్స్ లోని యుచాంగ్ కు చెందిన లాన్ (29) అనే యువకుడు.. తాను క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డానని.. చికిత్స కోసం తనకు డబ్బులు అవసరమని పేర్కొంటూ నిధుల సేకరణ ప్రచారాన్ని మొదలుపెట్టాడు. తనకు హాడ్జికిన్స్ లింఫోమా ఉందని ప్రచారం చేసుకున్నాడు. దాతలకు రిక్వస్టులు పెట్టాడు.
ఈ సందర్భంగా తనకు సోకిన క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం సుమారు 9,00,000 యువాలు (భారత్ కరెన్సీలో సుమారు రూ.1.05 కోట్లు) అవసరమని చెప్పాడు. ఇప్పటికే తన కుటుంబం తన తండ్రి వైద్య ఖర్చుల కోసం చాలా డబ్బు వెచ్చించిందని.. తనకు నిజంగా డబ్బు అవసరమని ప్రజలను నమ్మించాడు.
ఈ ప్రచారానికి మరింత బలాన్ని చోడిస్తూ... నాంజింగ్ యూనివర్సిటీలో అతని పాత సహవిద్యార్థులతో ఈ విషయాన్ని పంచుకున్న వీడియోలను పోస్ట్ చేశాడు! దీంతో.. ఇతని పరిస్థితిని అర్ధం చేసుకున్న వారు సుమారు 4,500 మంది దాదాపు 7,00,000 యువాన్లు (సుమారు 81.5 లక్షల రూపాయలు) సాయం చేశారు.
ఈ క్రమంలో.. నవంబర్ 6వ తేదీన గ్రూప్ చాట్ లో ఓ పోస్ట్ పెట్టాడు లాన్. ఇందులో భాగంగా... "ఇది నా కొత్త ఇల్లు" అంటూ అపార్ట్ మెంట్ ఫోటోలను పోస్ట్ చేశాడు. దీంతో.. పలువురి దాతలకు సందేహం వచ్చింది. ఇతడి వ్యవహారంపై విచారణ చేపట్టారు. ఇందులో వాన్ కు ఓ పెద్ద ఆస్తి ఉందని తెలుస్తుకున్నారంట.
దాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఏడాదికి సుమారు 1,45,000 యువాన్లను పొందుతున్నట్లు తేలిందంట. దీంతో... ఇతడు చెప్పిన ఆర్థిక కష్టాలను, ఇతడికి ఉన్న ఆస్తులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్ ఇతని ప్రచారాన్ని నిలిపివేసింది. అతడి పేరున వచ్చిన సుమారు 2,78,204 యువాన్లను దాతలకు తిరిగి ఇచ్చింది.
అయితే... అక్కడికి ఏమాత్రం తగ్గని లాన్.. తనకు వచ్చిన విరాళాల దుర్వినియోగాన్ని ఖండిస్తున్నట్లు చెప్పాడు. తన సేవింగ్స్ అకౌంట్ లో 2,00,000 యువాన్లను ఉంచానని.. అంతే తప్ప తనకు వచ్చిన విరాళాలను ఇల్లు కొనడానికి ఉపయోగించలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతడిపై చట్టపరమైన చర్యలకు సదరు క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్ ప్రయత్నిస్తుందని అంటున్నారు!