Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అక్కడ గజం రూ.10లక్షలు.. ఎక్కడంటే?

మీరు చదివింది అక్షరాల నిజం. ఒక గజం ధర ఎంత ఉంటుంది? అంటే.. ఎవరికి వారు వారికి తోచిన లెక్క చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 4:30 PM GMT
హైదరాబాద్ లో అక్కడ గజం రూ.10లక్షలు.. ఎక్కడంటే?
X

మీరు చదివింది అక్షరాల నిజం. ఒక గజం ధర ఎంత ఉంటుంది? అంటే.. ఎవరికి వారు వారికి తోచిన లెక్క చెప్పొచ్చు. కానీ.. ఎవరూ కూడా రూ.10 లక్షలు ఉంటుందని మాత్రం చెప్పలేరు. అయితే.. హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రాంతంలో గజం రూ.10లక్షల చొప్పున 101 గజాల స్థలాన్ని ఏకంగా రూ.10 కోట్లకు అమ్మిన వైనం సంచలనంగా మారింది. ఇప్పటివరకు హైదరాబాద్ లో ఎకరం రూ.వంద కోట్లుగా విన్నాం. కానీ.. గజం రూ.10 లక్షలు మాత్రం విన్నది లేదు. ఈ సరికొత్త రికార్డుకు కేరాఫ్ అడ్రస్ బేగంబజార్ నిలిచింది.

హైదరాబాద్ మహానగరంలో అన్ని రకాల హోల్ సేల్ వ్యాపారాలకు నెలవుగా ఉండే బేగంబజార్ లో ఈ తాజా క్రయ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. పాతబస్తీ పరిధిలోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని 101 గజాల స్థలాన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన వ్యాపారి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లోని హోల్ సేల్ వ్యాపార మార్కెట్లకు బేగం బజార్ అడ్రస్ గా చెబుతారు. వాణిజ్య మార్కెట్ లో దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పోటీ పడే సత్తా బేగంబజార్ సొంతం. ఈ ప్రాంతంలోమహారాష్ట్ర.. గుజరాత్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఉంటారు. ఈ బజార్ లో కొనుగోళ్ల కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తుంటారు.

ఇక్కడ ఉండే వ్యాపార కుటుంబాల వారు.. తమ వ్యాపారాలకు దగ్గరగానే నివాసాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అత్యంత రద్దీగా ఉండటంతో పాటు.. ఇరుగ్గా ఉన్నప్పటికీ.. అక్కడే తమకు సొంత జాగా ఉండాలని భావిస్తుంటారు. దీంతో.. పరిమితంగా ఉండే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడున్న వారు మరో ప్రాంతానికి వెళ్లటానికి ఆసక్తి చూపరు. ఇరుగ్గా ఉన్నప్పటికి అదే తమకు సౌకర్యంగా భావిస్తుంటారు.

ఇక్కడ.. భూమి ఉన్న వారు.. సొంత నివాసాలు ఉన్న వారిలో అత్యధికులు తమ ఆస్తుల్ని అమ్మేందుకు సుతారం ఇష్టపడరు. దీంతో.. ఆస్తులకు భారీ డిమాండ్ ఉంది. ఎంతకైనా కొనేస్తామన్నట్లుగా ఉంటుంది. ఈ కారణంగానే.. తాజా రికార్డు కొనుగోలు సాధ్యమైందని చెబుతున్నారు. ఈ ప్రాంతం మొత్తంలో ఉత్తరాది వారిదే అధిక్యతగా చెప్పాలి. వ్యాపార వర్గాలు భారీగా ఉండే.. ఈ ప్రాంతంలో రానున్నరోజుల్లో ధరలు మరిన్ని రికార్డులను నమోదు చేయటం ఖాయమని చెబుతున్నారు.