మళ్లీ ఆ స్థాయికి రాజధాని ప్రాంతంలో భూములు!
రియల్ ఎస్టేట్ రంగం ఈ రెండు జిల్లాల్లో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది.
By: Tupaki Desk | 17 Jun 2024 7:25 AM GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూములు రేట్లు పుంజుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ఈ రెండు జిల్లాల్లో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. నిర్మాణ రంగం కళకళలాడటం మొదలైంది.
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే)ను ఏర్పాటు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సీఆర్డీయే పరిధి ఉంది. దీంతో రాజధాని ప్రభావంతో రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఆకాశ హర్మ్యాలను తలపించేలా భారీ అంతస్తులు భవనాలను నిర్మించారు.
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మూడు రాజధానుల పాట ఎత్తుకోవడం, విశాఖపట్నాన్ని కార్వనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో అమరావతి బోసిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడకేసిందనే విమర్శలు ఉన్నాయి. చాలా భవంతుల నిర్మాణాలు అర్థంతరంగా ఆగిపోయాయి. బిల్డర్లు భారీ ఎత్తున నష్టపోయారని ప్రచారం జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అమరావతి మళ్లీ కొత్త రూపును సంతరించుకుంటోంది. 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు ఐదు రెట్లు పెరిగాయి. ఆ తర్వాత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ధరలు పతనమయ్యాయి. మళ్లీ ఐదేళ్ల తర్వాత 2019 స్థాయికి భూముల ధరలు చేరాయని క్రెడాయ్ ప్రతినిధులు చెబుతున్నారు.
‘2015 – 2019 మధ్య అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు ఐదు రెట్లు పెరిగాయి. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల భావనను ప్రతిపాదించిన తర్వాత అవి 50–70 శాతం పడిపోయాయి’ అని క్రెడాయ్ విజయవాడ చాప్టర్ ప్రధాన కార్యదర్శి వరద శ్రీధర్ తెలిపారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో, అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల ధరలు 50 శాతం పుంజుకోగా, విజయవాడ దాని పొరుగు ప్రాంతాల్లో 15–20 శాతం పెరిగాయని అంటున్నారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న భూమి చదరపు గజం ఎన్నికల ముందు రూ.15,000–20,000 వరకు ఉండగా ఇప్పుడు చదరపు గజం భూమి ధర రూ.40,000–50,000కు చేరుకుందని శ్రీధర్ వెల్లడించారు.
కాగా ఎన్నికల ఫలితాల ముందే కూటమి ప్రభుత్వం వస్తుందనే అంచనాలున్నవారు తక్కువ ధరలకే ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేశారని
మోడరన్ హోమ్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్ అబ్దుల్ రహీం చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, తదితర ప్రాంతాల్లోని ఆంధ్రులు.. గన్నవరం, విజయవాడ బందర్ రోడ్డులో భూములు, ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు.
గత ఐదేళ్లుగా రాజధానికి సంబంధించి అనిశ్చితి కారణంగా మైలవరంలో తమ కంపెనీ గతంలో చదరపు గజం రూ.1,500 తక్కువ ధరకు విక్రయించిందని రహీం వెల్లడించారు. అయితే, ఇప్పుడు తమ లేఅవుట్లలో చదరపు గజం రూ.5,000 వరకు ధరలు పెరిగాయన్నారు.
అమరావతిలో గత ఐదేళ్లుగా వదిలివేసిన కొన్ని నిర్మాణాలను ప్రభుత్వం తిరిగి యుద్ధప్రాతిపదికన చేపట్టింది. రెండున్నరేళ్లలోనే రాజధాని నిర్మాణాలన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. మూడు దశలో పనులు పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో అసెంబ్లీ, సచివాలయం, అధికారులు, ఉద్యోగుల నివాసాలు పూర్తి చేస్తామని, ఆ తర్వాత రెండో దశలో విజయవాడ– అమరావతి మెట్రో రైల్ నిర్మాణం చేపడతామన్నారు. మొత్తం లక్ష కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి ఖర్చు చేస్తామన్నారు.
ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని అందుకుంటాయని అంచనా వేస్తున్నారు.