Begin typing your search above and press return to search.

జగన్ బ్లండర్ మిస్టేక్..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్... 2022లో అసెంబ్లీలో వైసీపీ సభ్యులు మెజారిటీ బలంతో పాస్ చేసుకున్న ఈ చట్టం 2024లో తమ మెడకు చుట్టుకుంటుంది అని జగన్ అస్సలు ఊహించి ఉండరు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 9:37 AM GMT
జగన్ బ్లండర్ మిస్టేక్..ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
X

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్... 2022లో అసెంబ్లీలో వైసీపీ సభ్యులు మెజారిటీ బలంతో పాస్ చేసుకున్న ఈ చట్టం 2024లో తమ మెడకు చుట్టుకుంటుంది అని జగన్ అస్సలు ఊహించి ఉండరు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఈ చట్టం పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్రం అన్ని రాష్ట్రాల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేయాలని ఆదేశించిందని, అందుకు తాము మినహాయింపు కాదని వైసీపీ నేతలు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినా ప్రజల్లోకి ఆ సందేశం వెళ్లడం ఆలస్యమైంది. ఈ లోపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలకు టిడిపి చేరువైంది.

జగన్ ఓటమిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గట్టిగా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏ రాష్ట్రం కూడా ఈ చట్టాన్ని పైలెట్ ప్రాజెక్టు లాగా అమలు చేయడం కాదు కదా... దాని ఊసే ఎత్తడానికి ఇష్టపడలేదు. ఎన్నికల్లో ఈ యాక్ట్ తమ పార్టీకి డ్యామేజీ చేస్తుందని బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఆ యాక్ట్ ఊసెత్తలేదు. కానీ, ఏపీలో మాత్రం ఈ చట్టం ప్రజలకు మేలు చేస్తుంది అని, తమ పార్టీకి మైలేజీ ఇస్తుంది అని నమ్మిన జగన్ దానిని శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టులాగా అమలు చేశారు.

దీంతో, వివాదాస్పద స్థలాలు భూములు, పొలాలను జగన్ లాగేసుకుంటారని, అందుకే వైసిపికి ఓటు వేయొద్దని టిడిపి చేసిన ప్రచారం జనంలోకి బాగా దూసుకువెళ్ళింది. దాంతోపాటు, ఏపీలోని పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ తన ఫోటో వేసుకోవడంతో ప్రజలు తమ పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం ఏమిటి అన్న అసంతృప్తికి గురయ్యారు. రేపు ఈ యాక్ట్ అమల్లోకి వస్తే నిజంగానే జగన్ తమ భూములు లాగేసుకుంటారని మెజారిటీ ప్రజలు భావించారు.

ఈ యాక్ట్ ప్రకారం కేవలం తమకు జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని, ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటారు అన్న ప్రచారం కూడా జనాలను కలవరపాటుకు గురి చేసింది. అయితే, ఇందులో వాస్తవం, అవాస్తవం ఏమిటి అన్నది పక్కన పెడితే ఈ యాక్ట్ వల్ల జనం భూములు జగన్ జేబులోకి వెళ్తాయి అన్న ప్రచారం చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. వైసీపీ కళ్ళు తెరిచి టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలోపే డ్యామేజ్ జరిగిపోయింది.

వైసిపి ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన లబ్ధిదారులతో పాటు తటస్థులు కూడా ఈ యాక్ట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. భూమి, పొలం, స్థలం అనేది ఒక ఎమోషన్ గా సెంటిమెంట్ గా భావించే తెలుగు ప్రజలు తమకు నష్టం జరుగుతుందనుకొని వైసీపీని ఓడించాలని ఫిక్స్ అయ్యారని ఫలితాలు నిరూపిస్తున్నాయి.