అమ్మకానికి హైదరాబాద్ మెట్రో !?
మహిళలకు ఉచిత బస్ పథకం ఎఫెక్ట్ హైదారాబాద్ మెట్రో రైల్ కు తగిలింది.
By: Tupaki Desk | 11 May 2024 7:55 AM GMTమహిళలకు ఉచిత బస్ పథకం ఎఫెక్ట్ హైదారాబాద్ మెట్రో రైల్ కు తగిలింది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో మెట్రోను అమ్మకానికి పెట్టాలని ఎల్ & టి సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
మే 1 నాటికి 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి కొత్త చరిత్ర లిఖించిన హైదరాబాద్ మెట్రో రైల్ అంతలోనే అమ్మకానికి సిద్దంకావడం ప్రయాణికులకు మింగుడుపడడం లేదు. దేశంలోనే మూడో అతి పొడవైన మెట్రో వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది.
మియాపూర్-అమీర్‌పేట మార్గంలో 11 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను 2017లో తీసుకురాగా, అప్పటి నుంచి దశల వారీగా సర్వీసులను పెంచుతున్నారు. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గ్ మార్గాల్లో దాదాపు 68 కిలోమీటర్ల పొడవైన లైన్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం నగరంలో నిత్యం 4-5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో అమ్మకం వార్త కొత్త చర్చకు దారితీస్తున్నది.