ఏపీలో మరో భారీ పెట్టుబడి.. అత్యంత ఖరీదైన రిఫైనరీ
కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో భరోసా ఇవ్వడంతో ఆ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు బీపీసీఎల్ ప్రకటించింది.
By: Tupaki Desk | 26 Jan 2025 8:30 PM GMTఏపీ వాసులకు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.95 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ముందుకు వస్తోంది. వాస్తవానికి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 2014లోనే మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ.3 లక్షల కోట్లతో 60 మిలియన్ టన్నుల మెగా ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అయితే భూ సేకరణ సమస్య వల్ల ఆ దిశగా ముందడుగు పడలేదు. కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో భరోసా ఇవ్వడంతో ఆ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు బీపీసీఎల్ ప్రకటించింది.
ఏపీలో ఏర్పాటు చేయబోయే రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కోసం భూ సేకరణ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఫీడ్ బ్యాక్ అధ్యయనాల కోసం ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల కింద రూ.6,100 కోట్లు ఖర్చు చేసేందుకు బీపీసీఎల్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం మూలధన రాయితీలు సమకూరుస్తోంది. ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతోంది. ఇది పూర్తయిన తర్వాత 48 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతోందని చెబుతున్నారు. ప్రస్తుతానికి జాయింట్ వెంచర్ లో ప్రాజెక్టు చేపట్టేందుకు బీపీసీఎల్ చూస్తోంది.
కోస్తా తీరంలో ఏర్పాటు చేయబోయే రిఫైనరీ కోసం సుమారు 6 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ప్రాథమికంగా భూమిపై ప్రభుత్వంతో అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. ఏటా 3-3.5 మిలియన్ టన్నుల పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేయవచ్చిన చెబుతున్నారు. దేశంలో ఈ తరహా రిఫైనరీలు ప్రస్తుతం మూడు ఉన్నాయి. ఏపీలో నాలుగోది ఏర్పాటు కాబోతోంది.