చివరి క్షణంలోనూ నోరు జారారు.. బాబు మరో అడుగు!
ఈ సమయంలో అయినా.. జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది.
By: Tupaki Desk | 11 May 2024 1:39 PM GMTఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడింది. ఇక, చివరి రోజు చివరి నిముషం వరకు వైసీపీ, కూటమి పార్టీలు ప్రచారం చే్స్తూనే ఉన్నాయి. ఒక్క నిముషం కూడా వృధా చేసుకోకుండా నాయకులు ప్రచారంలో మునిగి తేలారు. ఇప్పటి వరకు అనేక విమర్శలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. వ్యక్తిగతం నుంచి అధికారం వరకు అన్ని విమర్శలూ.. అన్ని రకాల మాటలూ.. ప్రచారంలో ప్రజల చెవులను హోరెత్తించాయి. ఇక, ఒకే ఒక్క రోజు మిగిలి ఉంది. ఈ సమయంలో అయినా.. జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదనే వాదన వినిపిస్తోంది.
మూడు పార్టీల నాయకులు కూడా చివరి రోజు చివరి క్షణం ప్రచారంలో నోరు జారేశారు. అప్పటి వరకు అంతో ఇంతో సంపాయిం చుకున్న సింపతీని పోగొట్టుకున్నారు. సీఎం జగన్ చివరి ప్రచార సభ పిఠాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌పై ఇప్పటి వరకు చేస్తున్న విమర్శలకు మరింత మసాలా కలిపేశారు. పెళ్లాల విషయాన్ని చివరి నిముషంలోనూ కదిపారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. నాలుగో పెళ్లికి కూడా సిద్ధమే..రేపు ఇక్కడ గెలిస్తే.. హైదరాబాద్‌కు వెళ్లిపోతాడు.. అంటూ.. గత విమర్శలకే పదును పెంచారు. కానీ, చివరి నిమిషంలో చేసిన ఈ వ్యాఖ్యలు జనసేనలో ఆగ్రహాన్ని నింపాయి.
ఇక, చంద్రబాబు చివరి రోజు నాలుగో సభ కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించారు. ప్రజాగళంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చేయని భారీ కామెంటే చేశారు. ఇది మొత్తంగా చంద్రబాబుపై ఒకింత వ్యతిరేకత వచ్చేలా.. ఆయనను కార్నర్ చేసేలా చేసింది. ``మళ్లీ గెలిస్తే.. విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడంట`` అని వైసీపీ అధినేత, సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే.. అక్కడితో ఆగితే.. పెద్ద వివాదం అయ్యేది కాదు.. కానీ, ``విశాఖలో కాదు.. పోయి నీ తండ్రి సమాధి వద్ద చేసుకో ప్రమాణం`` అంటూ.. కటువుగా వ్యాఖ్యానించారు. ఇది వైఎస్ అభిమానులనే కాకుండా.. టీడీపీ వారిని కూడా ఒకింత ఆవేదనకు గురి చేసింది.
ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. చివరి సభలో మాట్లాడుతూ.. పాత విమర్శలే చేసినా..కొత్తగా వ్యాఖ్యానించారు. తనకు డబ్బులు లేక రాజకీయాల్లోకి రాలేదన్న ఆయన.. ప్రజల కోసమే వచ్చానని చెప్పారు. అయితే.. జగన్ ఓడిపోవాల్సిందే.. అని పదే పదే చెప్పడం గమనార్హం. అయితే.. దీనికి రెండు సార్లు రెస్పాన్స్ వచ్చినా.. మూడోసారి మాత్రం విస్మయం కలిగింది. మొత్తంగా చూస్తే.. చివరి రోజు చివరి నిముషంలో ఈ ముగ్గురు నాయకుల్లోనూ ఒకింత అసహనం.. మరికొంత ఏం జరుగుతుందో అనే ఆందోళన స్పష్టంగా కనిపించింది. మరి జనం ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.