Begin typing your search above and press return to search.

ప్రచారానికి చివరి వారం... ప్రధాన పార్టీల క్లైమాక్స్ షెడ్యూల్ ఇదే!

అవును... ఎన్నికల ప్రచారం చివరిదశకు వస్తుండటంతో వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో తెలంగాణ రాష్ట్రం హోరెత్తనుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 4:00 AM GMT
ప్రచారానికి చివరి వారం...  ప్రధాన పార్టీల  క్లైమాక్స్  షెడ్యూల్  ఇదే!
X

పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో దాదాపుగా మరో వారం రోజులే ప్రచారానికి సమయం ఉంది! దీంతో ప్రచారం విషయంలో చివరి వారం చితక్కొట్టేయడమే అని భావిస్తున్నాయంట ప్రధాన పార్టీలన్నీ! ఈ నేపథ్యంలో జాతీయ స్థాయి నేతలంతా ఈ నెల 23 తర్వాత తెలంగాణలోనే తిష్టవేయనున్నారని తెలుస్తుంది. ఈ నెల 23తో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఇక తనువు, మనసు మొత్తం తెలంగాణలోనే అని అంటున్నారు.

అవును... ఎన్నికల ప్రచారం చివరిదశకు వస్తుండటంతో వారం రోజులపాటు అగ్రనేతల ప్రచారంతో తెలంగాణ రాష్ట్రం హోరెత్తనుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... బీజేపీ నుంచి నరేంద్రమోడీ, అమిత్‌ షా, జె.పి.నడ్డా... కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జునఖర్గే... బీఆరెస్స్ నుంచి కేసీఆర్... జనసేన తరుపున పవన్‌ కల్యాణ్‌... సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, బృందాకారాత్ సహా పలువురు ముఖ్యనేతతో ప్రచారానికి పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయని సమాచారం.

24నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక:

తెలంగాణలో అధికార బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అని.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరుతామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పట్టుసడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ నెల 24 నుంచి 28 వరకు సుమారు ఇరవైకి పైగా సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా 24, 25, 27 తేదీల్లో ప్రియాంక గాంధీ సుమారు పది నియోజకవర్గాల్లో పర్యటించేలా పార్టీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ క్రమంలో... 24న పాలకుర్తి, హుస్నాబాద్‌, ధర్మపురి... 25న పాలేరు, వైరా, ఖమ్మం, మధిర... 27న మునుగోడు, గద్వాల, దేవరకొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో ఆమె ప్రసంగిస్తారు. ఇలా మూడు రోజుల్లో 10 బహిరంగ సభల్లో ఆమె పర్యటించనున్నారు!

మరోపక్క 24 నుంచి రాహుల్ గాంధీ రాష్ట్రంలోనే ఉండనున్నారు. ఇందులో భాగంగా... కామారెడ్డిలో 26న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మూడు రోజుల్లో వీలైనన్ని భారీ బహిరంగ సభలతోపాటు ర్యాలీల్లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నారు! 28వ తేదీన ప్రచారం ముగిసే వరకూ రాహుల్ రాష్ట్రంలోనే ఉండబోతున్నారని అంటున్నారు.

మోడీ మూడు రోజుల షెడ్యూల్ ఫిక్స్!:

కర్ణాటక ఎన్నికల్లో తగిలిన దెబ్బకు తెలంగాణ ఎన్నికలే ఆయింట్ మెంట్ అని బీజేపీ అగ్రనాయకత్వం బలంగా నమ్ముతుందని తెలుస్తుంది. దీంతో ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని బలంగా భావిస్తుంది! ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులపాటు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇందులో భాగంగా... 25న కామారెడ్డి, మహేశ్వరం.. 26న తూప్రాన్‌, నిర్మల్‌.. 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో జరిగే భారీ బహిరంగ సభలలో పాల్గొని ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇదే క్రమంలో 27న రెండు బహిరంగ సభలతో పాటు హైదరాబాద్‌ రోడ్‌ షోలో పాల్గొని తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు!

ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రచారం 24, 26, 28 తేదీల్లో ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా... బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సైతం మూడు రోజులు వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలలో పాల్గొంటారని... వీరితోపాటు వీలైతే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, హిమంత్‌ బిశ్వశర్మ, ప్రమోద్‌ సావంత్‌ కూడా రాష్ట్రానికి వస్తున్నారని సమాచారం!

సీపీఎం జాతీయ నేతల షెడ్యూల్ ఇదే!:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి గడువు దగ్గరపడుతుండటంతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కారాత్, సుభాషిణి అలీ, విజయరాఘవన్‌ ఇతర ముఖ్యనేతలు ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్‌ సభల్లో పాల్గొంటారని తెలుస్తుంది.

చివరి నిమిషం వరకూ మోతమోగించనున్న సీఎం!:

గతకొన్ని రోజులుగా తెలంగాణలో సరాసరిన రోజుకి రెండు నుంచి మూడు సభల్లో పాల్గొంటూ, పలు నియోజకవర్గాలను కవర్ చేస్తూ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం కేసీఆర్... ఎన్నికల ప్రచార సమయం పూర్తయ్యేవరకూ ఆ పనిలోనే ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... 28న వరంగల్‌, గజ్వేల్‌ బహిరంగసభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు.

ఐదు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం!:

అనూహ్యరీతిలో అన్నట్లుగా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతోకలిసి పోటీ చేస్తుంది జనసేన! ఈ క్రమంలో అటు జనసేన, ఇటు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర చేపట్టకపోయినా.. సభల్లో ప్రసంగిస్తారని తెలుస్తుంది! ఇందులో భాగంగా... 22 నుంచి వరంగల్‌ వెస్ట్‌, సూర్యాపేట, కొత్తగూడెం, దుబ్బాక, తాండూరు నియోజకవర్గాల్లోని సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు!