లాస్య నందిత మరణానికి కారణమైన 'కారు' ఎవరిది?
భద్రతా ప్రమాణాల్ని చూస్తే బాగానే ఉన్నా.. విదేశాల్లోని కార్లకు ఉండే భద్రతా ప్రమాణాలతో పోలిస్తే మాత్రం.. ఈ కారుకు ఉన్న రేటింగ్ అంత గొప్పగా లేదంటున్నారు.
By: Tupaki Desk | 24 Feb 2024 4:29 AM GMTఅనూహ్య రీతిలో ప్రమాదానికి గురై.. ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఉదంతం ఎంతకూ జీర్ణించుకోలేనిదిగా మారింది. ఆమె మరణం ముప్పును తప్పించుకునే వీలున్నా.. అలాంటిదేమీ జరగకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. చిన్నసైజు కార్పొరేటర్ సైతం ఇవాల్టి రోజున ఖరీదైన వాహనాల్ని వాడేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా మిడ్ రేంజ్ వాహనాన్ని లాస్య నందిత వాడటం ఏమిటి? అన్నది ప్రశ్న.
ఆమె ప్రాణాల్ని తీసిన ప్రమాద వేళలో ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతి ఎస్ ఎల్ జీ 6. భద్రతా ప్రమాణాల్ని చూస్తే బాగానే ఉన్నా.. విదేశాల్లోని కార్లకు ఉండే భద్రతా ప్రమాణాలతో పోలిస్తే మాత్రం.. ఈ కారుకు ఉన్న రేటింగ్ అంత గొప్పగా లేదంటున్నారు. నిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణించే ప్రజాప్రతినిధులు వీలైనంతవరకు భారీ వాహనాల్లోనే ప్రయాణిస్తుంటారు. ఇంతకూ లాస్య నందిత ప్రయాణించిన కారు ఎవరిది? అన్నది ప్రశ్న. ఇంతకూఆమె ఇంట్లో ఉన్న కార్లు ఎన్ని? అన్నది ప్రశ్నగా మారింది.
కుటుంబ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ఇంట్లో మొత్తం మూడు కార్లు ఉంటాయని చెబుతున్నారు. ఒక కారు పాతదని.. దాన్ని వాడట్లేదని చెబుతున్నారు. మరో వాహనం (ఫార్చునర్) ఉండగా.. తాజా వాహనం ఆమె బందువులదిగా తెలుస్తోంది. ఎన్నికల వేళ కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కానీ అవసరాలకు పనికి వస్తుందన్న ఉద్దేశంతో కొత్త కారును తీసుకున్నట్లు చెబుతున్నారు.
అయితే.. నందిత లాస్యకు ఉన్న పరిమితుల గురించి తెలిసిన ఆమె బంధువులు.. అభిమానంతో తమ తరఫున కారును ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సదరు కారు యజమాని పేరు వేరే ఉన్నప్పటికీ.. వాటి లాజిస్టిక్స్ మాత్రం నందితనే చూసుకుంటారని చెబుతున్నారు. బడ్జెట్ పరిమితుల కారణంగా ఖరీదైన భారీ కారు కొనలేదన్న మాట వినిపిస్తోంది. ఆమె ప్రాణాల్ని బలి తీసుకున్న కారు ఆమె కుటుంబానికి చెందినది కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. నల్గొండ సభ నుంచి తిరిగి వస్తున్న వేళలో.. ఆమెను పెను ప్రమాదం నుంచి తప్పించిన ఫార్చునర్ లో ప్రయాణించినా ప్రాణ ముప్పు తప్పేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.