ఆ తప్పులే.. ఎమ్మెల్యేను కబళించాయా?
అయితే.. ఈ ప్రమాద ఘటన వెనుక ప్రధానంగా మూడు తప్పులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
By: Tupaki Desk | 23 Feb 2024 4:25 AM GMTబీఆర్ ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే.. లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీంతో ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ ప్రమాద ఘటన వెనుక ప్రధానంగా మూడు తప్పులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
1) ఈ నెల 13న కారును ర్యాష్ డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌నే ఆమె కొనసాగించడం.
2) కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం. వాస్తవానికి కారులో ముందు సీటు మధ్య భాగం లో ఎమ్మెల్యే లాస్య కూర్చున్నప్పటికీ.. సీటు బెల్ట్ పెట్టుకోలేదు. దీంతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయారు. బెల్ట్ పెట్టుకుని ఉంటే గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకునేవారని అంటున్నారు.
3) దట్టమైన పొగమంచు ఆవరించుకున్న సమయంలో కూడా.. అత్యంత వేగంగా కారును నడపడం. నిజానికి దట్టమైన పొగమంచు ఉన్న సమయంలో కొంత జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిఉంటుంది. కానీ, ఈ విషయంలో డ్రైవర్ అత్యుత్సాహానికి పోయి.. ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు.
బీఆర్ ఎస్ వచ్చి ఉంటే..
ఇదిలావుంటే.. బీఆర్ ఎస్ మూడోసారి అదికారంలోకి వచ్చి ఉంటే.. లాస్య నందితకు.. మంత్రి వర్గంలో చోటు లభించేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే.. సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ఆకుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎన్నకల్లో టికెట్ ఇచ్చారు. ఆమె గెలిచారు. అయితే, పార్టీ అధికారంలోకి రాలేక పోయింది. వచ్చి ఉంటే.. ఆమెకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కి ఉండేదని అంటున్నారు.
సాయన్న ఇంట్లో వరుస విషాదాలు..
కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, బీసీ నాయకుడు సాయన్న ఇంట్లో వరుస విషాదాలు కూడా.. రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి 19వతేదీన సాయన్న అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలే కావడం గమనార్హం. లాస్య నందితకు వివాహం కావాల్సి ఉంది. అయితే.. ఎమ్మెల్యేగా విజయం దక్కించుకుని పట్టుమని ఆరు మాసాలు కూడా కాకుండా.. ఆమె మృత్యువాత పడడం గమనార్హం. గత ఎన్నికల్లో సుమారు 20 వేల ఓట్లతో ఆమె కంటోన్మెంట్ నుంచి విజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ తరఫున ఇక్కడ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేశారు.
సీఎం దిగ్భ్రాంతి..
లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ ఎమ్మెల్యే మృతి తీరని లోటని పేర్కొన్నారు.