Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో కీలక ముందడుగు!

సికింద్రాబాద్‌ పరిధిలోని కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 March 2024 8:06 AM GMT
ఎమ్మెల్యే లాస్య నందిత కేసులో కీలక ముందడుగు!
X

సికింద్రాబాద్‌ పరిధిలోని కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. డ్రైవర్‌ కారును అతివేగంగా నడపడటం, నిద్ర మత్తు, లాస్య నందిత సీటు బెల్టు ధరించకపోవడం వంటి కారణాలతో ఆమె మరణించిందని ప్రాథమికంగా నిర్ధారించారు,

ఈ క్రమంలో ఇప్పుడు లాస్య రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. ఎమ్మెల్యే కారు అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) రెయిలింగ్‌ ను ఢీకొట్టి ఆగిపోయే ముందు తొలుత ఢీకొన్న టిప్పర్‌ లారీని పోలీసులు గుర్తించారు.

లాస్య నందిత కారు ఓఆర్‌ఆర్‌ పైకి ప్రవేశించిన సమయంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్టు సీసీ కెమెరా ఫుటేజ్‌ సహాయంతో పోలీసులు తాజాగా గుర్తించారు. దీంతో టిప్పర్‌ డ్రైవర్‌ ను పటాన్‌ చెరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వెనక నుంచి తమ కారును లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్‌ సైడ్‌ కూర్చున్న ఎమ్మెల్యే లాస్య నందిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత పడింది.

ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్‌ ను లారీ డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయాడని తేలింది. తొలుత అతివేగంతో వచ్చి టిప్పర్‌ ను ఢీ కొట్టిన తర్వాత అదుపు తప్పిన కారు 100 మీటర్ల దూరం వెళ్లి రెయిలింగ్‌ ను ఢీ కొట్టిందని తెలుస్తోంది. కారు నడుపుతున్న లాస్య నందిత పీఏ ఆకాష్‌ నిద్ర మత్తులోకి వెళ్లడం, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి టిప్పర్‌ డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు మరిన్ని విషయాలను అతడి నుంచి రాబట్టే అవకాశం ఉంది. దీంతో ప్రమాదం జరిగిననాడు అసలు ఏం జరిగిందో వెల్లడి కానుంది.

ముందుగా టిప్పర్‌.. కారును ఢీకొందా? లేదా కారు టిప్పర్‌ ను వెనక నుంచి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. టిప్పర్‌ డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.