ప్రమాదానికి కాస్త ముందు లాస్య నందిత కారు నుంచి చిన్నారిని దించారు
ప్రమాదం జరిగిన రోజున లాస్య నందిత తల్లి, సోదరీమణులు ఇద్దరు ఎవరితోనూ మాట్లాడింది లేదు.
By: Tupaki Desk | 25 Feb 2024 4:15 AM GMTదివంగత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం షాక్ నుంచి వారి కుటుంబ సభ్యులు ఇంకా కోలుకోవటం లేదు. కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. ఏడాది వ్యవధిలో భర్త ఓవైపు.. కుమార్తెను కోల్పోయిన లాస్య నందిత తల్లి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక.. సోదరితో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ మిగిలిన సోదరీమణులు ఇద్దరు విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజున లాస్య నందిత తల్లి, సోదరీమణులు ఇద్దరు ఎవరితోనూ మాట్లాడింది లేదు.
శనివారం వారిని కొందరు మీడియా ప్రతినిధులు కలిశారు. ప్రమాదం అసలెలా జరిగింది? అసలేమైంది? అన్న వివరాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొత్త విషయం బయటకు వచ్చింది. రెండు కార్లలో ఫిబ్రవరి22 రాత్రి వేళ సదాశివపేట్ మండలం ఆరూర్ లోని మిస్కిన్ షా దర్గాకు వెళ్లి.. తెల్లవారుజామున పూజలు చేయించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
రెండు కార్లలో ఒక కారులో ఎమ్మెల్యే లాస్య నందిత, కారు డ్రైవర్ ఆకాశ్ తో పాటు చిన్నారి శ్లోక (లాస్య నందిత సోదరి కుమార్తె) ఉన్నారు. మరో కారులో ఇతర కుటుంబ సభ్యులు ఉననారు. ప్రమాదం జరగటానికి కొన్ని నిమిషాల ముందు వరకు చిన్నారి లాస్య నందిత కారులోనే ఉన్నారు. అయితే.. నగరానికి చేరుకోవటానికి ముందు.. తన కారును లాస్య నందిత ఆపించారు. తమ కారులో ఉన్న శ్లోకను తన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారులో ఎక్కించారు.
చిన్నారి స్కూల్ కు వెళ్లాల్సి ఉంటుందని.. అందుకే ముందు వెళ్లేందుకు వీలుగా శ్లోకను కారులో ఎక్కించి.. ఇంటి వెళ్లాలని చెప్పినట్లుగా పేర్కొన్నారు. తాను ఏదైనా తిని వస్తానని చెప్పి కుటుంబ సభ్యుల్ని పంపారు. ఇది జరిగిన కొన్ని నిమిషాల తర్వాతే వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఎమ్మెల్యే లాస్య నందిత మరణించటం తెలిసిందే.