గాల్లో విమానం.. బాత్రూమ్ లో మరణించిన పైలట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!
విమానం గాల్లో ఎగురుతోంది.. ఇంతలో బాత్రూమ్ కు వెళ్లిన పైలట్ అక్కడ కుప్పకూలిపోయాడు
By: Tupaki Desk | 17 Aug 2023 9:28 AM GMTవిమానం గాల్లో ఎగురుతోంది.. ఇంతలో బాత్రూమ్ కు వెళ్లిన పైలట్ అక్కడ కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికి పైలట్ రాకపోవడంతో అప్రమత్తమైన కో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అయితే అప్పటికే పైలట్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నెల 13 రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాలో మియామీ నుంచి చిలీ రాజధాని శాంటియాగోకి లాటామ్ ఎయిర్ లైన్స్ వాణిజ్య విమానం బయలుదేరింది.
ఈ క్రమంలో విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత పైలట్ ఇవాన్ ఆండౌర్ అస్వస్థతకు గురయ్యాడు. బాత్రూమ్ కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆయన ఎంతకీ రాకపోవడంతో గమనించిన ఇతర సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.
దీంతో అప్రమత్తమైన కో-పైలట్ విమానాన్ని సమీపంలోని పనామా సిటీలోని టోకుమెన్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. అనంతరం ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సిబ్బంది వచ్చి హుటాహుటిన ఇవాన్ ను పరిశీలించారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 56 ఏళ్ల ఇవాన్ గత 25 ఏళ్లుగా పైలట్‌గా పనిచేస్తున్నారు. పైలట్ మృతితో ఆ విమానంలోని ప్రయాణికులకు పనామాలోని హోటల్ లో వసతి కల్పించారు. మరుసటి రోజు వారికి చిలీకి చేర్చినట్లు లాటామ్ ఎయిర్ లైన్స్ తెలిపింది.
పైలట్ మృతి పట్ల లాటామ్ ఎయిర్ లైన్స్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. పైలట్ ఇవాన్ ఆండౌర్ తమ ఎయిర్ లైన్స్ లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని వెల్లడించింది. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయనను కాపాడుకోలేకపోయామని వాపోయింది.