Begin typing your search above and press return to search.

'స‌మ‌న్వ‌యం' లేని స‌మావేశాలు.. కూట‌మికి దెబ్బే.. !

ఉమ్మ‌డి అనంత‌పురం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో తాజాగా స‌మ‌న్వ‌య క‌మిటీ సమా వేశాల‌కు పిలుపునిచ్చారు.

By:  Tupaki Desk   |   7 Nov 2024 7:30 PM GMT
స‌మ‌న్వ‌యం లేని స‌మావేశాలు.. కూట‌మికి దెబ్బే.. !
X

కూట‌మి పార్టీల నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో క‌లివిడిగా ప‌నిచేయాల‌నేది సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌. టికె ట్ల కేటాయింపు నుంచి అనేక సంద‌ర్భాల్లో ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు క‌లిసి ఉండాల‌ని కూడా చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. అనేక జిల్లాల్లో కూట‌మి పార్టీల నాయకులు దారి త‌ప్పుతున్నారు. ర‌గ‌డ‌లు పెట్టుకుని ర‌చ్చ‌కెక్కుతున్నారు. దీంతో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేం దుకు.. చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు.

దీనిలో భాగంగానే కూట‌మి పార్టీల నేత‌ల‌కు స‌మ‌న్వ‌య క‌మిటీ సమావేశాలు నిర్వ‌హించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. దీనిలో భాగంగా మంత్రులు ఆయా స‌మావేశాల్లో చ‌ర్చించి.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న పొర‌పొ చ్చాల‌ను స‌రిదిద్దాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మంత్రుల‌కు సీఎం బాధ్య‌త‌లు కూడా అప్ప‌గిం చారు. అయితే.. ఈ స‌మావేశాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక‌టి రెండు మిన‌హా అస‌లు ఎక్క‌డా జ‌రిగిందేలేదు. పైగా అస‌లు స‌మ‌న్వ‌య క‌మిటీలు ఉన్నాయ‌న్న సంగ‌తే చాలా మందికి తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నిజానికి కొన్నికొన్ని జిల్లాల్లో ఇప్ప‌టికీ ఘ‌ర్ష‌ణ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఎవ‌రికి వారు ఒంటెత్తు పోక‌డ‌లు పోతూనే ఉన్నారు. దీంతో ఎక్క‌డి ఇబ్బందులు అక్క‌డే అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది. ఈ ప‌రిణామా ల‌ను స‌రిదిద్దేందుకు.. మంత్రులు కూడా పెద్దగా జోక్యం చేసుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారు త‌మ‌కు ఎందు కు? అనే భావ‌న‌తోనే ఉన్నారు. దీంతో ప‌రిస్థితిలో అయితే మార్పు క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశాలు జ‌రిగిన చోట కూడా.. నాయ‌కులు ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్టు గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉమ్మ‌డి అనంత‌పురం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో తాజాగా స‌మ‌న్వ‌య క‌మిటీ సమా వేశాల‌కు పిలుపునిచ్చారు. అయితే.. ఈ స‌మావేశాల‌కు ఒక్క‌రిద్దరు మిన‌హా ఎవ‌రూ హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ నుంచి మ‌రింత ఎక్కువ‌గా గైర్హాజ‌రు క‌నిపించింది. ఇక‌, బీజేపీ నుంచి కూడా పెద్ద‌గా ఎవ‌రూ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశాలు ముందుకు సాగ‌డం లేదు. ఇది అంతిమంగా కూట‌మిపై ఎఫెక్ట్ చూపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.