Begin typing your search above and press return to search.

జీఎస్టీ: కోత కొన్నింటికి.. వాటికి వాతలే.. రూ.22వేల కోట్ల అదనపు ఆదాయం

తాజాగా మంత్రి వర్గం చేసిన సూచనల్ని జీఎస్టీ కమిషన్ ఓకే చేయాల్సి ఉంటుంది. మంత్రి వర్గ ఉప సంఘం ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత కాదనే ప్రసక్తి దాదాపుగా ఉండనట్లే.

By:  Tupaki Desk   |   20 Oct 2024 11:30 AM GMT
జీఎస్టీ: కోత కొన్నింటికి.. వాటికి వాతలే.. రూ.22వేల కోట్ల అదనపు ఆదాయం
X

ఒక దేశం ఒకే పన్ను విధానం పేరుతో జీఎస్టీని తీసుకురావటం తెలిసిందే. కనిష్ఠంగా 5 శాతం.. గరిష్ఠంగా 28 శాతం.. కొన్నింటికి మాత్రం 28 శాతం జీఎస్టీతో పాటు సెస్ ను వడ్డించటం తెలిసిందే. తాజాగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు వస్తువులు.. వస్తు సేవలపై వేస్తున్న జీఎస్టీ రేట్లకు కోత పెట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో మరికొన్నింటిపై ఇప్పటికే వడ్డిస్తున్న జీఎస్టీకి అదనంగా వాతలు వేయాలని డిసైడ్ చేశారు. మొత్తంగా తగ్గింపులు.. హెచ్చుల కూడికలు.. తీసివేతల అనంతరం తేలిందేమంటే.. రూ.22 వేల కోట్ల అదనపు ఆదాయానికి కేంద్రం ప్లాన్ చేసింది.

తాజాగా మంత్రి వర్గం చేసిన సూచనల్ని జీఎస్టీ కమిషన్ ఓకే చేయాల్సి ఉంటుంది. మంత్రి వర్గ ఉప సంఘం ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత కాదనే ప్రసక్తి దాదాపుగా ఉండనట్లే. ఇక.. దేశ ప్రజలకు మేలు చేసే కోతల విషయానికి వస్తే.. 20 లీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లపై ఇప్పటివరకు18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. దానిని 5 శాతానికి తగ్గించాలని డిసైడ్ చేశారు. అదే సమయంలో నోట్ బుక్స్ మీద ఇప్పటివరకు వసూలు చేస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇక.. రూ.10వేల లోపు ధరలున్న సైకిళ్లపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

క్యాన్సర్ ఔషధాలపై ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. స్నాక్స్ (నమికిన్స్ ) 18 శాతం జీఎస్టీ ఉంది. దానిని 12 శాతానికి తగ్గించాలని డిసైడ్ చేశారు. ఇలా ఊరట కలిగించే అంశాలు ఉన్నట్లే.. మంట పుట్టే నిర్ణయాలు కూడా లేకపోలేదు. రూ.15 వేల కంటే ఎక్కువ విలువ ఉన్న షూస్.. రూ.25 వేల కంటే ఎక్కువ ధర ఉన్న వాచ్ ల మీద ఇప్పటివరకు ఉన్న 18శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు. 18 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్లు.. హెయిర్ కర్లర్లు.. బ్యూటీ.. మేకప్ సామాగ్రిపై ఉన్న జీఎస్టీని 28 శాతం శ్లాబులోకి చేర్చాలని డిసైడ్ చేశారు.

సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో 100 వస్తువులకు సంబంధించిన జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. మొత్తంగా వివిధ రకాల వస్తువులపై విధిస్తున్న సగటు జీఎస్టీ రేటు 15.3 శాతానికి తక్కువగా చేరింది. దీంతో.. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరించాలని డిసైడ్ చేశారు. ఈ సమావేశంలోజీవిత బీమా.. ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ సమావేశంలో కీలక నిర్ణయం వెలువడుతుందని భావించారు. అయితే.. ఈ అంశంపై ఎక్కువసేపు చర్చ జరిగినప్పటికీ.. చివరకు తుది నిర్ణయాన్ని మండలి.. మంత్రుల టీంకు ఆ బాధ్యతను అప్పజెప్పారు.

బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరికి ఈ బాధ్యతను కట్టబెట్టారు. కొందరు కొత్త సభ్యులు కూడా ఈ టీంలో చేరతారని.. అక్టోబరు చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ అంశంపై నవంబరులో జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆన్ లైన్ గేమింగ్.. కాసినోలపై వచ్చే ఆదాయం ఆర్నెల్లలో 412 శాతం పెరిగింది. దీని కారణంగా ఖజానాకు రూ.6909 కోట్లకు దీని ఆదాయం చేరనుంది.