Begin typing your search above and press return to search.

వైఎస్సార్ ఆత్మ బంధువులు ఎక్కడ ?

ఇవన్నీ పక్కన పెడితే వైఎస్సార్ ఆస్తులలో మెజారిటీలో ఆయన సిఎంగా ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించిన కంపెనీలే ఉన్నాయని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:26 PM GMT
వైఎస్సార్ ఆత్మ బంధువులు ఎక్కడ ?
X

ఏపీలో వైఎస్సార్ వారసుల మధ్య ఆరని చిచ్చు రగులుతోంది. అది ఎంతదాకా వెళ్లింది అంటే కోర్టులలో తేల్చుకునేంతగా. వైఎస్సార్ జీవించి ఉన్నపుడు వారసుల ప్రస్తావన అయితే లేదు. అయితే 2009లో వైఎస్ జగన్ ని ఆయన ఎంపీగా కాంగ్రెస్ తరఫున నిలబెట్టి గెలిపించుకున్నారు. వైఎస్సార్ రాజకీయాలను ప్రజల కోసం చేశారు. ఆయన వారసులు ఉండాలని వారు కూడా రాజకీయంగా రాణించాలని పెద్దగా ఆశలు అయితే పెట్టుకోలేదు

ఇక వైఎస్సార్ సంపాదించిన ఆస్తుల విషయం తీసుకుంటే ఆయన రాజకీయాల్లో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నారు. అయితే ఆయన సుదీర్ఘమైన నిరీక్షణ ఫలించి 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో రెండవసారి సీఎం అయిన మూడు నెలలకే మరణించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కాక ముందు ఆస్తులు చూస్తే తక్కువే అంటారు. ఆయన సీఎం అయ్యాకనే ఎక్కువ ఆస్తులు కనిపిస్తాయి.

వైఎస్సార్ స్వార్జితం అంటే ఆయన బతికున్నపుడు పంచిన ఆస్తులు ఉన్నాయి. ఇక ఆయన సీఎం అయ్యాక కుమారుడు జగన్ వ్యాపారాలలో ఉన్నారు. అలా తండ్రి పలుకుబడితో జగన్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు అన్నవి ఆరోపణలు. అందుకే కేసులు. ఈ విషయాలు ఇలా ఉండగా ఇపుడు ఈ ఆస్తుల కోసమే చిచ్చు రగులుతోంది.

గత కొన్నేళ్ళుగా వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వై.ఎస్. షర్మిల బాహాటంగానే సమరం సాగిస్తున్నారు. ఇక ఈ ఇద్దరు తల్లి, వైఎస్ విజయమ్మ అన్నా చెల్లెలు మధ్య విభేదాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు అంటారు. ఆ మీదట ఆమె కుమార్తె వైపే మొగ్గు చూపారు అన్నది కూడా జరుగుతున్న పరిణామాల బట్టి అర్ధం అవుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాల నేపథ్యంలో వైఎస్సార్ ఇమేజ్ ఇబ్బందులలో పడుతుందని అంటున్నారు. అయితే ఈ కీలక సమయంలో వైఎస్సార్ తో ఎంతో సాన్నిహిత్యం నెరిపి ఆయనకు నీడలా ఆత్మలా ఉన్న వారు ఇపుడు ఎక్కడ ఉన్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వారు ఈ ఇద్దరు మధ్యన విభేదాలు దూరం చేయలేరా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మధ్యనే తాత్కాలికంగా జగన్ షర్మిల మధ్య సయోధ్య కుదిరిందని ప్రచరం అయితే సాగింది. అయితే అలాంటిది ఏమీ కాదని లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక సుమారుగా 200 కోట్ల విలువైన షేర్లను తన తల్లి విజయమ్మ తన సోదరి వైఎస్ షర్మిలకు అక్రమంగా బదిలీ చేశారంటూ జగన్ ఎన్‌సీఎల్‌టీని లేటెస్ట్ గా ఆశ్రయించారు.

దాంతో కుటుంబంలో అగ్గి రాజుకుంది. ఈ క్రమంలో వైఎస్ కుటుంబానికి చెందిన సన్నిహితులు, ఇతర శ్రేయోభిలాషులు ఏమయ్యారు అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. జగన్ షర్మిల మధ్య విభేదాలు రూపుమాపేందుకు స్వచ్చందంగా పెద్దరికం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు అన్న మాటే వినిపిస్తోంది.

ఇక చూస్తే కనుక వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ అని పిలుచుకున్న కేవీపీ రామచంద్రరావు గానీ వైఎస్సార్ తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి గానీ ఈ అన్నా చెల్లెళ్ళ అన్నదమ్ముల మధ్య వైరాన్ని తగ్గించేందుకు సిద్ధంగా లేరా అన్న డౌట్లు వస్తున్నాయి. ఒక వేళ తాము జోక్యం చేసుకుంటే తమ ప్రమేయం వల్ల కొత్తగా ఇబ్బందులు వస్తాయని వారు ఆలోచిస్తున్నారా అని కూడా అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే వైఎస్సార్ ఆస్తులలో మెజారిటీలో ఆయన సిఎంగా ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించిన కంపెనీలే ఉన్నాయని చెబుతున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన చాలా మందికి ఆ సంస్థలను స్థాపించడం వెనుక ఉన్న నేపథ్యం భవిష్యత్తులో వాటితో వైఎస్సార్ ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసునని అంటున్నారు. అంతే కాదు, వైఎస్సార్ ఏమి చేశారో,ఆ కంపెనీల నుంచి వైఎస్సార్ ఎవరికి ప్రొసీడింగ్స్‌ ఇచ్చారో ఆ వ్యక్తులు కాస్త వెలుగులోకి తెస్తే ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అలా ఆ కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తతలను ఆందోళనను తగ్గించవచ్చునని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైఎస్సార్ కి చెందిన అన్ని కంపెనీలకు ఆడిటర్‌గా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రస్తుతం నెలకొన్న ఈ మొత్తం సమస్య పరిష్కారానికి సహకరిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకే వైఎస్సార్ కుటుంబానికి చెందిన అన్ని సంస్థలు, స్టాక్‌లు, షేర్ల నేపథ్యం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉందని అంటున్నారు.

ఏది ఏమైనా వైఎస్సార్ సహచరులు ఉన్నారు. ఆత్మ బంధువులు ఉన్నారు. దగ్గర బంధువులు అనదగిన వారు కూడా ఉన్నారు. వారంతా ఈ కీలకమైన సమయంలో కనుక నిజాలు చెప్పగలిగితే వైఎస్ఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.లేకపోతే మాత్రం ఇదే తీరున రచ్చ అవడం ఖాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.