Begin typing your search above and press return to search.

543 ఎంపీ స్థానాల్లో 300 స్థానాల్లో పోటీ!

మొత్తం 543 ఎంపీ స్థానాల్లో తాను 300 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 5:38 AM GMT
543 ఎంపీ స్థానాల్లో 300 స్థానాల్లో పోటీ!
X

మరో మూడు నెలల్లో మొదలయ్యే సార్వత్రిక ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అధికార బీజేపీకి బలమైన సవాలు విసిరే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మిత్రపక్షాలతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసి.. ఈసారి ఎన్నికల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని తపిస్తున్న కాంగ్రెస్ తాజాగా తాను పోటీ చేసే లోక్ సభ స్థానాలపై ఒక క్లారిటీకి వచ్చింది. మొత్తం 543 ఎంపీ స్థానాల్లో తాను 300 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.

దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్లుగా చెబుతోంది. మిగిలిన 243 స్థానాల్ని మిత్రపక్షాలకు విడిచి.. తాను వారితో కలిసి పని చేయాలన్న యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు చెబుతున్నారు. తాము పోటీ చేయని 243 స్థానాల్లో మిత్రులకు మద్దతు ఇవ్వనున్నట్లుగా ఆ పార్టీ చెబుతోంది. గుజరాత్.. హర్యానా.. హిమాచల్ ప్రదేశ్.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఉత్తరాఖండ్.. ఛత్తీస్ గఢ్.. ఒడిశా.. ఆంధ్రప్రదేవ్.. కర్ణాటక.. అసోం రాష్ట్రాల్లో బీజేపీని.. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను ఒంటరిగా ఢీ కొనాలని కాంగ్రెస్ భావిస్తోందని చెబుతున్నారు.

అదే సమయంలో ఉత్తరప్రదేశ్.. బిహార్.. మహారాష్ట్ర.. పశ్చిమబెంగాల్.. కేరళ.. తమిళనాడు.. జార్ఖండ్.. ఢిల్లీ.. పంజాబ్.. తెలంగాణలలో మిత్రపక్షాలతోపొత్తు పెట్టుకొని బీజేపీని ఇతర పార్టీలను ఢీ కొనాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లుగా చెబుతున్నారు. సీట్ల పంపకాలపై కసర్తతు కోసం ఆయా రాష్ట్రాల పార్టీ యూనిట్లతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 52 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్.. ఈసారి తాను పోటీ చేసే 300 స్థానాల్లో కనీసం సగం సీట్లలో అయినా గెలుస్తానన్న నమ్మకాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. అయితే.. ఆచరణలో ఎంతమేర వర్కువుట్ అవుతుందన్నది ప్రశ్నగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో 209 నియోజకవర్గాల్లో రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్.. ఈ రెండు స్థానాలను కలిపితే 261 స్థానాలు అవుతాయని చెబుతున్నారు.

పార్టీ గెలిచే అవకాశం లేని సీట్లలో ఆయా రాష్ట్రాల్లో గత రెండు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినఓట్ల ఆధారంగా తానుకానీ.. మిత్రపక్షానికి కానీ సీట్లుకేటాయించేలా చేస్తే మంచి ఫలితాన్ని సాధించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్ల విషయంలో పేచీలకు పోకుండా.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించటం ద్వారా పరస్పర ప్రయోజనం పొందే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. మిత్రపక్షాలు ఎలా రియాక్టు అవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.