Begin typing your search above and press return to search.

గృహజ్యోతి’కి సరికొత్త మార్గదర్శకాలు ఇవే

తెలంగాణలోని రేవంత్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకుంటున్న ఆరు గ్యారెంటీల్లో కీలకమైనది ‘గృహజ్యోతి’.

By:  Tupaki Desk   |   17 Feb 2024 4:03 AM GMT
గృహజ్యోతి’కి సరికొత్త మార్గదర్శకాలు ఇవే
X

తెలంగాణలోని రేవంత్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకుంటున్న ఆరు గ్యారెంటీల్లో కీలకమైనది ‘గృహజ్యోతి’. ఇందులో ప్రతి ఇంటికి 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించే అంశం తెలిసిందే. ఇళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేసే ఈ పథకానికి లబ్థిదారులుగా ఉండాలనుకుంటే ఏం చేయాలన్న దానిపై తాజాగా కచ్ఛితమైన మార్గదర్శకాలు వచ్చాయి. మొదట్లో దీనిపై కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. తాజాగా అధికారులు క్లారిటీకి వచ్చినట్లుగా చెబుతున్నారు.


‘గృహజ్యోతి’ లబ్ధిదారులు కావాలనుకునే వారు తొలుత తమ ఆధార్ ను కరెంటు బిల్లుతో ఆథెంటిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అనుసంధానం కాదు. కేవలం ధ్రువీకరణ మాత్రమే. దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలు పారదర్శకంగా అమలు చేయటానికి ఆధార్ సహా గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పేర్కొంది.

బయో మెట్రిక్ విధానంలో ఈ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ చెబుతోంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లబ్థిదారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలంటే ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో.. వారి ఆధార్ ను విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ లేని పక్షంలో దాని స్థానే బ్యాంక్.. పోస్టాఫీసు పాస్ బుక్.. ఫోటోతో ఉన్న జిరాక్సు.. పాస్ పోర్టు.. ఓటరు గుర్తింపు కార్డు.. ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు.. కిసాన్ పాస్ బుక్.. డ్రైవింగ్ లైసెన్సు.. ఇలాంటి వాటిల్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఆధార్ ధ్రువీకరణ తర్వాతే మిగిలిన అంశాలు ఉంటాయని చెబుతున్నారు.

అయితే.. ఆధార్ తో ధ్రువీకరణ అంశం కొత్త తలనొప్పులకు కారణమవుతున్నాయి. అద్దెకు ఉండేవారు.. తమ ఆధార్ తో ధ్రువీకరణ చేయించుకుంటే ఇంటి మీద తమకున్న యాజమాన్య హక్కులపై సందేహాల్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఒకరికి పది ఇళ్లు ఉంటే.. అందులో తొమ్మిదింటిని అద్దెకు ఇవ్వొచ్చు. ఇంటి యజమానికి ఈ పథకంలబ్థిదారులు కారు. కానీ.. ఆయన 9 ఇళ్లలో ఉండే అద్దెదారులు మాత్రం లబ్థిదారులే అవుతారు. ఇప్పుడు అధికారులు చెబుతున్నట్లుగా ఆధార్ తో ధ్రువీకరణ చేయిస్తే.. తన ఇంటి మీద వారికి హక్కు వస్తుందన్న తప్పుడు భావనతో అనుమానిస్తున్న వారు లేకపోలేదు. ఇలాంటి వాటిపై కూడా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.